Harbhajan Singh : టీమిండియా ఆలయ సందర్శన వివాదం.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన హర్భజన్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా టీ20 వరల్డ్‌కప్ విజయం అనంతరం ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లిన ఘటనపై మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు కీర్తి ఆజాద్ ప్రశ్నలు లేవనెత్తారు. భారత జట్టులో వివిధ మతాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారని గుర్తుచేస్తూ, అలాంటి సందర్భాల్లో ఆలయంతో పాటు మసీదు, చర్చ్ లేదా గురుద్వారాలను కూడా సందర్శించవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత క్రికెట్ జట్టు 1.4 బిలియన్ భారతీయులను ప్రతినిధ్యం వహిస్తుందని, కాబట్టి విజయ వేడుకలు అన్ని మతాల సమానత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
Details
హర్భజన్ సింగ్ ఘాటైన ప్రతిస్పందన
కిర్తి ఆజాద్ వ్యాఖ్యలపై మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెంటనే స్పందించారు. ఆలయం, మసీదు, చర్చ్, గురుద్వారా అన్నీ సమానంగా పవిత్రమైన ప్రార్థనా స్థలాలేనని ఆయన అన్నారు. ఎవరికైనా తమ విశ్వాసం ప్రకారం దేవుడిని ప్రార్థించే హక్కు ఉందని స్పష్టం చేశారు. "ఒక ఆటగాడు లేదా బోర్డు సభ్యుడు తన విశ్వాసాన్ని అనుసరించి ప్రార్థనలు చేస్తే అందులో తప్పేముంది? ట్రోఫీని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి తీసుకెళ్లవచ్చని హర్భజన్ వ్యాఖ్యానించారు. మతాన్ని రాజకీయాలతో కలపడం సరైంది కాదని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Details
వివాదం నుంచి దూరంగా ఇషాన్ కిషన్
ఈ వివాదంపై ఇషాన్ కిషన్ మాత్రం చాలా సమతూకంగా స్పందించారు. పాట్నాలో మీడియాతో మాట్లాడిన సమయంలో జర్నలిస్టులు కిర్తి ఆజాద్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, ఆయన చాకచక్యంగా దానిని తప్పించుకున్నారు. మేం వరల్డ్ కప్ గెలిచాం. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. దయచేసి జట్టు విజయానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి అని కిషన్ మీడియాకు చెప్పారు.
Details
క్రికెట్ ప్రపంచంలో చర్చ
ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు కిర్తి ఆజాద్ అభిప్రాయాన్ని సమర్థించగా, మరికొందరు హర్భజన్ సింగ్ చెప్పిన మత సామరస్య భావనకు మద్దతు ఇచ్చారు. ఇటీవల టీమిండియా సాధించిన వరల్డ్‌కప్ విజయం దేశవ్యాప్తంగా ఆనందాన్ని నింపినప్పటికీ, ఈ వివాదం క్రికెట్, మతం మధ్య ఉన్న సంబంధంపై కొత్త చర్చలకు దారి తీసింది. టీమిండియా విజయం దేశానికి గర్వకారణం. అయితే ఈ సంఘటన మత సామరస్యంపై చర్చను రేకెత్తించింది. చాలా మంది క్రికెట్ అభిమానుల అభిప్రాయం ప్రకారం, ఆట కంటే పెద్దది ఏదీ లేదని, విజయాన్ని అందరూ కలిసి ఆనందించాలనే భావన మరింత బలపడింది.