Virat Kohli: జట్టు విజయమే ప్రాధాన్యం.. రికార్డుల గురించి ఆలోచించను: కోహ్లీ
ఈ వార్తాకథనం ఏంటి
విరాట్ కోహ్లీ పేరు చెబితేనే ప్రపంచ క్రికెట్‌లో ఓ శక్తివంతమైన ఆటగాడు గుర్తొస్తాడు. లక్ష్యం ఎంత పెద్దదైనా వెనక్కి తగ్గని ధీశాలి.
ఐసీసీ టోర్నమెంట్‌ల్లో తనదైన శైలిలో పరుగుల వరద పారించే 'చేజ్ మాస్టర్'. టీమిండియా లెజెండ్ కోహ్లీ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో, దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.
264 పరుగుల ఛేదనలో భారత్ తొలుత కష్టాల్లో పడగా, కోహ్లీ చిత్తశుద్ధితో జట్టును ఆదుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి, భారత్‌ను విజయపథంలో నడిపించాడు.
Details
16 పరుగుల దూరంలో సెంచరీ మిస్
భారత్ విజయానికి 39 పరుగుల అవసరమైన దశలో భారీ షాట్‌కు ప్రయత్నించిన కోహ్లీ ఔటయ్యాడు.
98 బంతుల్లో 5 ఫోర్లతో 84 పరుగులు చేసిన కోహ్లీ, సెంచరీ చేయడం తృటిలో తప్పిపోయాడు.
అయితే, అతని ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.
Details
జట్టుకు విజయమే ముఖ్యం
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయం ముఖ్యం అని స్పష్టం చేశాడు. "పాకిస్తాన్‌పై ఛేదన ఎలా జరిగిందో, ఇదీ అలాగే సాగిందన్నారు.
ఈ మ్యాచ్‌లో కూడా పరిస్థితులను అర్థం చేసుకొని తన వ్యూహాన్ని మార్చుకున్నానని చెప్పారు.
స్ట్రయిక్ రొటేట్ చేయడమే తన ప్రాధాన్యత అని, భాగస్వామ్యాలు నెలకొల్పడం ఎంతో అవసరమని కోహ్లీ సూచించారు.
నాకౌట్ మ్యాచ్‌లలో వికెట్లు చేతిలో ఉంటే ప్రత్యర్థి ఒత్తిడిలోకి వెళ్తుంది. తమ లక్ష్యాన్ని ముందుగా అర్థం చేసుకొని ఆట సాగించామన్నారు. మైలురాళ్లు తనకు ముఖ్యం కావని, గెలిస్తే అదే పెద్ద సంతృప్తి అన్నారు.