వన్డే వరల్డ్ కప్‌కి తెలుగు కుర్రాడు అవసరం : రవిశాస్త్రి
భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం ఐసీసీ ఇటీవలే షెడ్యూల్‌ను ప్రకటించింది. సొంతగడ్డపై ఈ మెగాటోర్నీ జరగనుండటంతో రోహిత్ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కొన్ని కీలక సూచనలు చేశారు. 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు యువరాజ్‌సింగ్, గౌతమ్‌గంభీర్ ఉన్నారని, ఆ ఇద్దరూ అసాధారణ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అయితే వారి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారని రవిశాస్త్రి ప్రశ్నించాడు. 2011 ప్రపంచ కప్ సమయంలో ముగ్గురు లెప్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారని, ప్రస్తుత జట్టులో టాపార్డర్ ఆడగలిగే లెప్ట్ హ్యాండర్స్ ఒక్కరు కూడా లేడని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
తిలక్ వర్మకు అవకాశం కల్పించాలి
రవీంద్ర జడేజా రూపంలో మరో లెప్టాండర్ ఉన్నా, టాప్-3లో ఆడగలిగే లెప్టాండర్ లేకపోవడం టీమిండియాకు సమస్యగా మారిందని, లెప్టాండార్స్ ను తీసుకోవాలంటే ఇషాన్ కిషన్, యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని రవిశాస్త్రి సూచించాడు. 1987, 1996 ప్రపంచ కప్ గెలిచిన జట్లలో లెప్టాండర్లు కీలక పాత్ర పోషించారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టులోనూ టాప్- 6లో లెప్టాండర్స్ ఉండడం గమనార్హం. లెప్టాండర్స్ ఉంటేనే టీమ్ కాంబినేషన్ సరిగ్గా ఉంటుంది. అయితే వన్డే ప్రపంచ కప్ కోసం భారత సెలెక్టర్లు లెప్టాండర్స్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో వేచి చూడాల్సిందే.