ఆ నిర్ణయం షాక్‌కు గురి చేసింది: సచిన్
టీమిండియాపై ఆస్ట్రేలియా గెలుపొంది టెస్టు ఛాంపియన్ గా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియాపై ప్రశంసలు వెల్లువత్తున్నాయి. అదే సమయంలో భారత్ ఓటమిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కూడా భారత జట్టు సెలక్షన్, ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకోకపోవడంపై సచిన్ విస్మయం వ్యక్తం చేశాడు. నంబర్ 1 బౌలర్ గా ఉన్న అశ్విన్ ఎలాంటి పిచ్ పై నైనా రాణించగలడని అతను గుర్తు చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను గెలుచుకున్న ఆస్ట్రేలియాకు అభినందనలని సచిన్ పేర్కొన్నారు.
అశ్విన్ ను తీసుకోకపోవడంపై సచిన్ ట్వీట్
స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ మొదటి రోజు గొప్పగా రాణించారని, మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు చేయలేకపోయిందని, ఆర్ అశ్విన్ ను జట్టులో నుంచి ఎందుకు తప్పించారో తనకు ఇప్పటికీ అర్ధం కాలేదని సచిన్ వెల్లడించారు. మ్యాచుకు ముందే చెప్పినట్లుగా నైపుణ్యం ఉన్న స్పిన్నర్లకు టర్నింగ్ ట్రాక్ అవసరం లేదని, వారు వాతావరణం, పిచ్ ఉపరితలం ఉపయోగించి హెచ్చు తగ్గులు చేయగలరని, ఆస్ట్రేలియా జట్టులో టాప్ 8 బ్యాట్స్‌మెన్‌లలో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్స్ అని సచిన్ ట్వీట్ చేశారు. మేఘావృతమైన పరిస్థితుల కారణంగానే అశ్విన్‌ను తీసుకోలేదని కోచ్ ద్రవిడ్ సమర్థించుకున్నాడు.