Afghanistan Team: అంచనాలకు మించి రాణిస్తున్న అఫ్గాన్ జట్టు.. వారి ప్రయాణం స్ఫూర్తిదాయకం
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇంగ్లండ్ టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగింది. చాలామంది మాజీలు, విశ్లేషకులు ఇంగ్లిష్ జట్టుకే ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువ అని చెప్పారు. ఈసారి బలమైన జట్టుతో టోర్నీలో అడుగుపెట్టిన బట్లర్ సేన, ఏకంగా అఫ్గానిస్తాన్ లాంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోయింది. కొన్నేళ్లుగా అఫ్గాన్‌ను అనుసరిస్తున్న వాళ్లకు ఇంగ్లండ్‌పై విజయం గాలివాటం విజయంలా అనిపించి ఉండదు. ఆ దేశం ఎన్నో కఠిన పరిస్థితుల నడుమ వన్డే ప్రపంచ కప్ టోర్నీలోకి అడుగుపెట్టింది. కొన్ని రోజుల క్రితం అఫ్గాన్ లో భూకంపం సంభవించింది. దీంతో అక్కడ ఏకంగా 3వేల మందికి పైగా ప్రాణాలు విడిచారు. ఇక తాలిబన్ల చేతిలో ఉన్న ఆఫ్గాన్ పరిస్థితి దయనీయంగా మారింది.
ఆఫ్గాన్ ప్రజలు నవ్వడం మరిచిపోయారు : రషీద్ ఖాన్
జాతీయ జట్టు తరుఫున ఏదైనా సిరీస్ ఆడాల్సినప్పుడు మాత్రమే ఆఫ్గాన్ ప్లేయర్లు అంతా ఒక చోటికి చేరుతున్నారు. మిగతా సమయాల్లో టీ20, టీ20 లీగ్స్ ఆడుతుంటారు. వాళ్ల కుటుంబాలు మాత్రం దుబాయి లాంటి చోట్ల స్థిరపడ్డాయి. ఇలాంటి స్థితిలో ఆ జట్టు ప్రపంచకప్‌లో అడుగుపెట్టి ఇంగ్లండ్ లాంటి మేటి జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్ తర్వాత ఆఫ్గాన్ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురై, ఈ విజయాన్ని తమ దేశ భూకంప బాధితులకు అంకితమిచ్చారు. ఆఫ్గాన్ ప్రజలు నవ్వడం మరిచిపోయారని, ఈ విజయం వారి ముఖాల్లో కొంచెం చిరునవ్వును తీసుకొస్తుందని ఆశిస్తున్నానని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. ఆఫ్గాన్‌కు భారత్ అండగా నిలిచింది. ఆ దేశంలో స్టేడియం నిర్మించడమే కాకుండా, క్రికెట్ సౌకర్యాలను సమకూర్చింది.