Asia Cup 2023: గతంలో భారత్, పాకిస్తాన్ లేకుండా ఆసియా కప్.. ఎందుకో తెలుసా?
క్రికెట్ అభిమానులు ఉత్కంఠం ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్గనిస్తాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఈ ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నా, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ జట్లు కూడా ప్రమాదకరంగా కన్పిస్తున్నాయి. దీంతో టోర్నీ రసవతర్తంగా సాగే అవకాశాలున్నాయి. ఇప్పటివరకూ 13సార్లు ఆసియా కప్ టోర్నీ జరిగింది. టీమిండియా ఏడుసార్లు ఈ టోర్నీలో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అయితే టీమిండియా ఒకసారి ఆసియా కప్ కు దూరంగా ఉండడం గమనార్హం. అలాగే పాకిస్తాన్ జట్టు కూడా ఒకసారి ఈ టోర్నీకి దూరమైంది.
1986లో ఆసియా కప్ నుంచి తప్పుకున్న భారత్
1984లో మొదటి సారిగా ఆసియా కప్ ప్రారంభమైంది. ఆ టోర్నీ విజయవంతం కావడంతో మళ్లీ 1986లో ఆసియా కప్ ను నిర్వహించారు. అప్పట్లో భారత్ జట్టు లేకుండానే ఆసియా కప్ జరిగింది. టీమిండియా స్థానంలో బంగ్లాదేశ్ వచ్చి చేరింది. క్రికెట్ సంబంధిత వ్యవహారాలతో పాటు సివిల్ వార్ కారణంగా భారత్ లేకుండానే రెండో ఎడిషన్ జరగడం విశేషం. అదే విధంగా 1990 ఎడిషన్ లోనూ పాకిస్థాన్ జట్టు పాల్గొనకపోవడం గమనార్హం. భారత్‌తో రాజకీయ పరమైన విభేదాలు తలెత్తడంతో పాకిస్తాన్ అప్పట్లో ఆ టోర్నీ నుండి తప్పుకుంది. సియాచిన్ విషయంలో భారత్-పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆసియా కప్ 1990 టోర్నీలో ఆడకుండా దూరంగా ఉండిపోయింది.