Page Loader
ENG vs IND: నేటి నుంచే నాలుగో టెస్టు.. టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందంటే?
నేటి నుంచే నాలుగో టెస్టు.. టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందంటే?

ENG vs IND: నేటి నుంచే నాలుగో టెస్టు.. టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2025
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కీలక దశలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు నేడు (బుధవారం) మాంచెస్టర్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ముగిసిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ ఒకటి గెలిచి, రెండు ఓడిపోయింది. దాంతో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ నిలుపుకోవాలంటే భారత జట్టు ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి లేదా కనీసం డ్రా చేయాల్సిందే. అయితే నాలుగో టెస్టు ముందు టీమిండియాకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. గాయాలు, తుది జట్టు ఎంపికలో అనిశ్చితి జట్టును ఇబ్బందుల్లోకి నెట్టింది.

Details

భారత జట్టు.. కీలక మార్పులు?

భారత తుది జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఓపెనర్లుగా రాహుల్, యశస్వి జైస్వాల్ పరిపూర్ణ ఆరంభం ఇవ్వాల్సిన బాధ్యతతో బరిలోకి దిగనున్నారు. నితీశ్‌ రెడ్డి స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి రానున్నారు. వరుస వైఫల్యాల్లో ఉన్న కరుణ్ నాయర్‌కు మరో అవకాశం ఇవ్వనున్నారు. మూడో స్థానంలో సాయి ఆడే అవకాశముంది. మరోవైపు గాయాల బెడదతో బయటకు వెళ్లిన రిషబ్‌ పంత్ తిరిగి జట్టులోకి వచ్చారు, ఇది భారత్‌కు సానుకూల అంశం. శుభ్‌మన్‌ గిల్‌కు కెప్టెన్సీ భారం ఉండగా, అతడిపై పెద్ద ఇన్నింగ్స్‌ ఆశలు ఉన్నాయ్. రవీంద్ర జడేజా మంచి లయలో ఉండటం కూడా భారత్‌కు ఊరట కలిగిస్తోంది.

Details

బౌలింగ్ విభాగంలో గందరగోళం

బౌలింగ్ పరంగా భారత జట్టు ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. జస్పిత్ బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడని భావించినప్పటికీ, గాయాల కారణంగా అతడికి ఆట తప్పని పరిస్థితి ఏర్పడింది. బుమ్రా, మహమ్మద్ సిరాజ్ జట్టును ముందుండి నడిపించాల్సి ఉంటుంది. నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ గాయాలతో దూరమవడంతో శార్దూల్ ఠాకూర్ లేదా ప్రసిద్ధ్ కృష్ణ ఒకరు జట్టులోకి రానున్నారు. అదే సమయంలో అంశుల్ కాంబోజ్ అరంగేట్రం చేసే అవకాశాన్ని పూర్తిగా తేల్చిపారేయలేము. పిచ్ పరిస్థితుల పరంగా చూస్తే ఓల్డ్ ట్రాఫోర్డ్‌ పేసర్లకు అనుకూలం. దీనితో శార్దూల్‌ ఠాకూర్‌కు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి.

Details

ఇంగ్లండ్ జట్టు.. పునరుత్తేజంతో సిద్ధం

ఇదిలా ఉండగా లార్డ్స్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ ఉత్సాహంతో నాలుగో టెస్టుకు సిద్ధమైంది. బౌలింగ్‌ విభాగంలో జోఫ్రా ఆర్చర్‌ రాకతో బలం మరింత పెరిగింది. వోక్స్‌, కార్స్‌లు అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటింగ్‌లో రూట్‌, బ్రూక్‌, స్మిత్‌, డకెట్‌ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. స్టోక్స్‌ కెప్టెన్‌గా బృందాన్ని బాగా నడిపిస్తున్నారు. గాయాల కారణంగా బయటకు వెళ్లిన షోయబ్ బషీర్‌ స్థానంలో డాసన్ తుది జట్టులోకి వచ్చారు. విజయోత్సాహంతో ఉన్న ఇంగ్లండ్‌ను చక్కటి ప్రదర్శనతో కట్టడి చేయాలి అనేది భారత్ ముందున్న పెద్ద సవాల్. మరోవైపు, వాతావరణం మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు కనిపిస్తున్నాయి.