Virat Kohli: 2024లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే!
రికార్డులను బద్దలు కొట్టడంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli) దిట్ట. గత 16 ఏళ్లగా ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 2024లో కూడా కోహ్లీ అనేక రికార్డులను బద్దలు కొట్టడానికి అవకాశాలున్నాయి. టీమిండియా జనవరి 3 నుంచి ఈ సంవత్సరంలో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. కాబట్టి ఇక్కడే నుండే విరాట్ కోహ్లీ రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. 2023లో ఒకే ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గా నిలిచాడు. ఇక వన్డేల్లో అత్యధిక సెంచరీల చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ
గతేడాది కోహ్లి 35 మ్యాచ్‌లలో 66.06 సగటుతో 2048 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు,10 హాఫ్ సెంచరీలున్నాయి. టీ20 క్రికెట్‌లో 12000 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలవడానికి విరాట్ కోహ్లీ 35 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్ ఉన్నారు.
సచిన్ రికార్డుకు ఐదు సెంచరీల దూరంలో కోహ్లీ
స్వదేశంలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ గా నిలవడానికి కోహ్లీ 5 సెంచరీల దూరంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 42 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పేందుకు విరాట్ కోహ్లీకి 1 సెంచరీ అవసరం. ప్రస్తుతం కోహ్లి, సచిన్ టెండూల్కర్ చెరో తొమ్మిది సెంచరీలతో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ 383 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 820 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
కుమార్ సంగ్కర్ రికార్డుకు చేరువలో కోహ్లీ
వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రెండో స్థానానికి చేరుకోవడానికి కోహ్లీకి 386 పరుగులు అవసరం. ప్రస్తుతం కోహ్లీ 13848 పరుగులు చేశాడు. శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర 14234 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించడానికి విరాట్ కోహ్లి కేవలం 152 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 350 మ్యాచ్‌లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.