
Matthew Breetzke ODI World record : ఒకే ఒక్కడు.. వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన దక్షిణాఫ్రికా యువకుడు!
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ మాథ్యూ బ్రీట్జ్కే (Matthew Breetzke) వన్డేల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అరంగేట్రం నుంచి వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ యాభైకి పైగా స్కోర్లు సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన రెండో వన్డేలో బ్రీట్జ్కే 85 పరుగులు చేసి ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇంతకుముందు అరంగేట్రం నుంచి వరుసగా నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 50 ప్లస్ స్కోర్లు చేసిన టీమిండియా ఆటగాడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
Details
అరంగ్రేటం మ్యాచులోనే అత్యధిక స్కోరు
2025లో లాహోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ద్వారానే బ్రీట్జ్కే అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లోనే 150 పరుగులు చేసి, అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై 83, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా 57, 88 పరుగులు చేశాడు. తాజాగా లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై 85 పరుగులు సాధించాడు.
Details
మ్యాచ్ వివరాలివే
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 330 పరుగులు చేసింది. బ్రీట్జ్కే (85; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (58; 62 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు బాదారు. ఐడెన్ మార్క్రం (49), డెవాల్డ్ బ్రెవిస్ (42) మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లు, ఆదిల్ రషీద్ 2 వికెట్లు, జాకబ్ బెథెల్ 1 వికెట్ తీశారు. అనంతరం 331 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులకే పరిమితమైంది.
Details
ఐదు పరుగుల తేడాతో గెలుపు
ఫలితంగా 5 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున జో రూట్ (61; 72 బంతుల్లో 8 ఫోర్లు), జోస్ బట్లర్ (61; 51 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జాకబ్ బెథెల్ (58; 40 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నాంద్రే బర్గర్ 3 వికెట్లు, కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీశారు. కార్బిన్ బాష్, సెనూరన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి ఒక్కో వికెట్ తీసి జట్టుకు సహకరించారు.