Rohit Sharma: రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలో వారి ఇద్దరి పాత్ర కీలకం : టీమిండియా మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ల పాత్ర ఉందంటూ భారత జట్టు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్ర ఆరోపణలు చేశాడు. రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పటికీ, అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని తివారీ తప్పుబట్టాడు. వన్డే జట్టు కొత్త సారథిగా శుభ్‌మన్ గిల్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది అజిత్ అగార్కర్ అయినప్పటికీ, దీని వెనక గౌతమ్ గంభీర్ పాత్ర కూడా ఉందని తివారీ అభిప్రాయపడ్డాడు.
Details
అగార్కర్, గంభీర్ ఇద్దరూ బాధ్యులే
ఈ విషయమై ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ మనోజ్ తివారీ, అగార్కర్ సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడడు. కానీ ఇంత పెద్ద నిర్ణయాన్ని అతడు ఒక్కడే తీసుకున్నాడని నేను అనుకోవడం లేదు. దీనికి వేరొకరి సూచనలు ఉండి ఉంటాయి. కోచ్ ఆలోచనల ప్రకారమే చీఫ్ సెలక్టర్‌గా అతడు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అందుకే దీనికి అగార్కర్, గంభీర్ ఇద్దరూ బాధ్యులేనని వ్యాఖ్యానించాడు. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి కీలక టోర్నీలను గెలిపించిన కెప్టెన్‌ను తొలగించి, అతడి స్థానంలో కొత్త వ్యక్తిని సారథిగా నియమించడం సరికాదని తివారీ అభిప్రాయపడ్డాడు. ఇది రోహిత్ శర్మకు అవమానం చేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించాడు.
Details
భారత జట్టు ఎంపికపై తివారీ విమర్శలు
అలాగే వన్డే వరల్డ్ కప్ 2027లో రోహిత్ శర్మ ఆడగలడా అనే అంశంపై సెలక్టర్లకు ఎందుకు సందేహాలు ఉన్నాయో తనకు అర్థం కావడం లేదని తివారీ చెప్పాడు. రోహిత్ సామర్థ్యాన్ని అనుమానించడం పొరపాటని, వన్డే ఫార్మాట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. ఇదే సందర్భంలో ప్రస్తుత భారత జట్టు ఎంపిక ప్రక్రియపై కూడా తివారీ విమర్శలు గుప్పించాడు. తుది జట్టు ఎంపికలో అనేక లోపాలు, అసమానతలు ఉన్నాయని, ముఖ్యంగా ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక సరిగ్గా లేదని ఆరోపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు వన్డే మ్యాచ్‌లపై ఆసక్తి కూడా తగ్గిపోయిందంటూ తన అసంతృప్తిని వెల్లడించాడు.