
IND c vs PAK c: భారత్ - పాక్ సెమీస్‌కు ముందు కలకలం.. కీలక ప్రకటనతో స్పాన్సర్ బయటకు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో మరోసారి భారత జట్టు-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ దిశగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ మ్యాచ్ చుట్టూ వివాదాలు రేగుతున్నాయి. ఇప్పటికే లీగ్ దశలో భారత్ పాకిస్థాన్‌తో ఆడేది లేదని భారత మాజీలు తేల్చి చెప్పడంతో మ్యాచ్ రద్దయింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు సెమీఫైనల్‌కు చేరుకోవడంతో తాజాగా మరోసారి తలపడే పరిస్థితి తలెత్తింది. ఈ మ్యాచ్ జరగుతుందా లేదా అన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. జూలై 31న బర్మింగ్‌హామ్‌లో ఈ కీలక సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈనేపథ్యంలో టోర్నమెంట్ స్పాన్సర్ అయిన ఈజ్‌మైట్రిప్ కీలకంగా స్పందించింది. కంపెనీ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా ద్వారా ఈ సెమీస్ మ్యాచ్‌కు వారు స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
Details
పాకిస్థాన్ తో సెమీస్ లో తలపడడం దురదృష్టకరం
నిశాంత్ మాట్లాడుతూ ఉగ్రవాదం, క్రికెట్ ముడిపడి ఉండవు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్‌లో సెమీస్ దశకు చేరిన భారత జట్టుకు అభినందనలు. దేశం గర్వపడేలా చేశారు. అయితే పాకిస్థాన్‌తో సెమీస్‌లో తలపడాల్సి ఉండటం దురదృష్టకరం. మేం ఎప్పుడూ భారత జట్టుకు మద్దతుగా ఉంటాం. కానీ ఇరుదేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడేవరకు ఇలాంటి మ్యాచ్‌లకు మేము స్పాన్సర్ చేయబోము. భారతీయుల భావాలను గౌరవిస్తూ ఈ మ్యాచ్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంటున్నాం. కొన్ని విషయాలు క్రీడలకు మించినవి. దేశం ముందు.. బిజినెస్ తర్వాత. జై హింద్ అని పేర్కొన్నారు. లీగ్ దశలో భారత్-పాక్ మ్యాచ్ రద్దవడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
Details
పాకిస్థాన్ నేరుగా ఫైనల్ కు చేరే అవకాశం
కానీ ఇప్పుడు విషయం నాకౌట్ దశకు రావడంతో టోర్నీ నిర్వహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. భారత్ ఆడకూడదనే నిర్ణయం తీసుకుంటే పాకిస్థాన్ నేరుగా ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు భారత మాజీ క్రికెటర్ల నుంచి ఈ అంశంపై స్పందన రాలేదు. తాజాగా యువరాజ్ సింగ్ నాయకత్వంలోని టీమ్‌ఇండియా, వెస్టిండీస్‌పై విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచి సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయంచేసింది. ఇప్పటికే పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా కూడా నాకౌట్ దశకు చేరుకున్నాయి. మరోవైపు విండీస్, ఇంగ్లాండ్ టోర్నీ నుంచి వెనుదిరిగాయి. ఈ నేపథ్యంలో, భారత జట్టు సెమీస్‌లో పాల్గొంటుందా? లేదా? అన్నది అభిమానుల్లో ఉత్కంఠ రేపింది.