Shahid Afridi: ఇది సిగ్గుచేటు.. మన దేశ పరువును మనమే తీసుకుంటున్నాం : పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది
వన్డే వరల్డ్ కప్ 2023లో వరుస ఓటములతో పాకిస్థాన్ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో బాబార్ సేన ఆట అధ్వాన్నంగా ఉందని పాక్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పాకిస్థాన్ టాప్ 4లోకి రావాలంటే, ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జాకా ఆష్రఫ్‌కి, బాబార్ అజామ్‌కి మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో బాబార్ ఆజామ్ వాట్సప్ చాట్ లీక్ కావడం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిది స్పందించాడు.
వాట్సప్ చాట్ లీక్ పై మండిపడ్డ ఆఫ్రిది
మరోవైపు ఇది చాలా దారుణమని పాక్ మాజీ ప్లేయర్ వకార్ యూనిస్ పేర్కొన్నాడు. ఇక బాబార్ ఆజామ్ వాట్సప్ చాట్ లు లీక్ కావడంపై షాహిద్ ఆఫ్రిది మండిపడ్డాడు. ఇది సిగ్గుచేటు అని, మన దేశ, ఆటగాళ్ల పరువును మనమే తీసుకుంటున్నామని, ఒకరి ప్రైవేట్ మెసేజ్‌లను, అది కూడా కెప్టెన్ బాబర్ అజామ్ మెసేజ్ లను ఎలా లీక్ చేస్తారని ప్రశ్నించారు. బాబర్ ఆజం, జాకా అష్రఫ్ మధ్య విభేదాలు ఉన్నాయని రషీద్ లతీఫ్ చెప్పారని, ఇలాంటి పరిణామాలను తీసుకురావడం మంచి పద్ధతి కాదని తెలియజేశారు.