Ishan-Shreyas: 'ఎవరినీ బలవంతం చేయలేరు'.. ఇషాన్-శ్రేయాస్ వ్యవహారంపై సాహా కీలక వ్యాఖ్యలు
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బుధవారం తొలగించడంపై భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పందించాడు. ఒక ఆటగాడు దేశవాళీ క్రికెట్‌లో ఆడకూడదనుకుంటే బలవంతంగా ఏమీ చేయలేమని సాహా చెప్పాడు. మంచి ఆటగాడిగా ఎదగడానికి దేశవాళీ క్రికెట్‌నే ఆధారమని, ప్రతి ఒక్కరూ దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వార్షిక కాంట్రాక్టుల నుంచి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ను తొలగించడం గురించి మాట్లాడుతూ.. ఇది బీసీసీఐ నిర్ణయం అన్నారు. అలాగే దేశవాళీ క్రికెట్ ఆడకూడదనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయమన్నారు. ఈ రెండింటిలో దేన్నీ బలవంతం చేయలేమన్నారు.
అన్ని మ్యాచ్‌లు అడాలి: సాహా
ఒక క్రికెటర్ ప్రతి మ్యాచ్‌కు సమానమైన ప్రాముఖ్యత ఇవ్వాలని సాహా చెప్పాడు. నేను ఫిట్‌గా ఉన్నప్పుడల్లా అన్ని మ్యాచ్ లు ఆడుతానన్నాడు. తాను క్లబ్ మ్యాచ్‌లు ఆడానని, ఆఫీస్ మ్యాచ్‌లు కూడా ఆడానన్నారు. తాను అన్ని మ్యాచ్‌లను సమానంగా చూస్తానన్నాడు. ప్రతి ఆటగాడు ఇలా ఆలోచిస్తే అతను తన కెరీర్‌లో మంచి వృద్ధిలోకి వస్తాడని సాహా హితవు పలికాడు. ఇది భారత క్రికెట్‌కు కూడా మంచిదన్నాడు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ గురించి సాహా మాట్లాడారు. సర్ఫరాజ్ ఖాన్ గత నాలుదైదేళ్లలో చాలా పరుగులు చేసాడన్నారు. ఇప్పుడు మంచి ప్రదర్శన చేశారన్నారు.