IND vs NZ: దురదృష్టకరరీతిలో ఔట్.. కన్నీటితో మైదానాన్ని వీడిన రోహిత్ శర్మ!
బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్నతొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ వికెట్ కోల్పోయాడు. అజాజ్ పటేల్ వేసిన బంతిని రోహిత్ శర్మ జాగ్రత్తగా డిఫెన్స్ చేసినప్పటికీ, అనుకోని విధంగా వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటనను చూసి నాన్‌స్ట్రైకర్ విరాట్ కోహ్లితో సహా స్టేడియంలో ఉన్న అభిమానులందరూ ఆశ్చర్యపోయారు. వికెట్ కోల్పోయిన అనంతరం రోహిత్ తన దురదృష్టంపై విచారం వ్యక్తం చేస్తూ క్రీజులోనే భావోద్వేగానికి గురయ్యాడు. బాధతో తల పట్టుకున్న రోహిత్,మైదానం నుంచి బాధతో నిష్క్రమించాడు.
రోహిత్ అర్ధ సెంచరీ
అసలేం జరిగిందంటే.. అజాజ్ పటేల్ 22వ ఓవర్‌లో ఐదో బంతిని ఆఫ్ స్టంప్ పక్కన లెంగ్త్ డెలివరీ వేశాడు. రోహిత్ దాన్ని ఫార్వర్డ్ డిఫెన్స్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బ్యాట్ ఔట్‌సైడ్‌కు తాకినప్పటికీ, ప్యాడ్స్-బ్యాట్ మధ్య ఉన్న ఖాళీ నుంచి బంతి నిదానంగా వికెట్ల వైపు కదిలి, ఒక్క స్టెప్ తీసుకుని బెయిల్స్‌ను తాకింది. రోహిత్ వెనుదిరిగి చూసేలోపే,బంతి వికెట్లను తాకి బెయిల్స్ పడటంతో రోహిత్ శర్మ నిస్సహాయంగా మిగిలిపోయాడు. చిన్నస్వామి స్టేడియం అంతా ఒక్కసారిగా నిశ్శబ్ధంగా మారిపోయింది.అయితే ఇంతకు ముందు ఓవర్‌లోనే రోహిత్ వరుసగా 4, 6, 4 బౌండరీలు బాది, అర్ధశతకాన్ని సాధించాడు.
న్యూజిలాండ్ 402 పరుగులు
మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో రోహిత్ పుల్‌షాట్ కొట్టి బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు.కానీ 50 పరుగుల మార్క్ సాధించిన తర్వాత, ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. రోహిత్ శర్మ 63 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది బౌండరీలు, ఒక సిక్సర్ ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 26 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి (19), సర్ఫరాజ్ ఖాన్ (13) ఉన్నారు. భారత్ ఇంకా 235 పరుగుల వెనుకబాటులో ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులు మాత్రమే చేయగా, న్యూజిలాండ్ 402 పరుగులు సాధించింది.