LOADING...
Vaibhav : ఐర్లాండ్ అల్లర్ల ప్రభావం.. వైభవ్ తొలి మ్యాచ్‌కు ముప్పు?
ఐర్లాండ్ అల్లర్ల ప్రభావం.. వైభవ్ తొలి మ్యాచ్‌కు ముప్పు?

Vaibhav : ఐర్లాండ్ అల్లర్ల ప్రభావం.. వైభవ్ తొలి మ్యాచ్‌కు ముప్పు?

వ్రాసిన వారు Moogati Shabari
Jun 12, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో చోటు సంపాదించిన ఈ 15 ఏళ్ల సంచలన ఆటగాడు ఐర్లాండ్ సిరీస్ ద్వారానే టీమిండియా తరఫున తొలి మ్యాచ్ ఆడతాడని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం ఐర్లాండ్‌లో కొనసాగుతున్న అల్లర్లు, సామాజిక ఉద్రిక్తతలు ఆ అవకాశాలపై ప్రభావం చూపుతున్నాయి. దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా ఇప్పటికే లిస్బన్‌లో నిర్వహించాల్సిన ఇంటర్-ప్రొవిన్షియల్ టీ20 ఫెస్టివల్‌ను అధికారులు రద్దు చేశారు.

వివరాలు

48 గంటల్లో నిర్ణయం..

ఇదే సమయంలో ఆదివారం జరగాల్సిన ఐరిష్ సీనియర్ కప్, నేషనల్ కప్ మ్యాచ్‌ల భవితవ్యంపై వచ్చే 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ ఐర్లాండ్ వెల్లడించింది. ఈ సందర్భంగా క్రికెట్ ఐర్లాండ్ విడుదల చేసిన ప్రకటనలో, అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తున్నామని పేర్కొంది. ప్రావిన్షియల్ యూనియన్లు, స్థానిక అధికారులతో నిరంతర సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఆటగాళ్లు, కోచ్‌లు, మ్యాచ్ అధికారులు, అభిమానుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేసింది. పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి రాకపోతే భారత్-ఐర్లాండ్ సిరీస్ నిర్వహణ కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.

వివరాలు

ఫార్మాట్‌కు తగ్గట్టు ఆటతీరు మార్చుకున్న సూర్యవంశీ..

కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకుని సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్‌లో ఇండియా-ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున దూకుడైన బ్యాటింగ్‌తో సిక్సర్ల వర్షం కురిపించిన ఈ యువ ఆటగాడు, వన్డే ఫార్మాట్‌లో మాత్రం భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నాడు. గురువారం ఆఫ్ఘనిస్థాన్-ఏతో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 44 పరుగులు చేసినప్పటికీ ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం విశేషం. అయితే అతని పోరాటం జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. చివరకు ఇండియా-ఏ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

Advertisement