Yogeshwar Dutt: వినేష్ ఫోగట్ క్షమాపణ చెప్పాలి.. ఇతరులపై నిందలు వేయటం కాదు: యోగేశ్వర్ దత్
బీజేపీ నేత, రెజ్లర్ యోగేశ్వర్ దత్ (Yogeshwar Dutt) స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒలింపిక్స్‌లో జరిగిన అనర్హత అంశాన్ని ఆమె తప్పిదంగా పరిగణించారు. వినేశ్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒలింపిక్స్‌లో బరువు పెరగడం వినేశ్ తప్పేనని, దీన్ని కుట్రగా చూపడం తగదన్నారు. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం, ఒక్క గ్రాము బరువు పెరిగినా అనర్హతగా పరిగణించబడుతుందని ఆమెకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. తను ఆమె స్థానంలో ఉంటే దేశ ప్రజలకు ఎప్పుడో క్షమాపణలు చెప్పేవాడినని అన్నారు.
ఆసక్తికరంగా జులానా ఎన్నికలు
వినేశ్ తన ప్రవర్తనతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ, ఆమె నిరసనలు, పార్లమెంట్ ప్రారంభోత్సవ సమయంలో చేసిన మార్చ్‌లు కాంగ్రెస్ పథకం లో భాగమని విమర్శించారు. వినేశ్ దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రవర్తించారని మండిపడ్డారు. బరువు పెరగడం వల్ల ఒలింపిక్స్ అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్ కుస్తీని వీడి రాజకీయాల్లోకి ప్రవేశించారు. హర్యానాలోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున యోగేశ్ బైరాగి పోటీ చేస్తున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ నుండి డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెజ్లర్ కవితా దలాల్ పోటీ చేస్తున్నారు. దీంతో జులానా ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.