Vinod Kambli: క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స..
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా దిగజారినట్టు సమాచారం. కుటుంబ సభ్యులు అతనిని థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేర్పించారు. 52 ఏళ్ల వయసున్న కాంబ్లీ చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ, ఆయన పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడమే కాకుండా అవసరమైన అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ మధ్య కాంబ్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
కపిల్ దేవ్‌ను కాంబ్లీకి సహాయం
ఇటీవల ముంబైలోని శివాజీ పార్క్ మైదానంలో దివంగత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారకార్థం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంబ్లీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంలో వీల్ చైర్‌లో కూర్చున్న కాంబ్లీని చూసిన వారందరూ షాక్‌కు గురయ్యారు, ఎందుకంటే అతను సరిగ్గా నిలబడలేకపోవడమే కాకుండా, మాట్లాడడంలో కూడా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. ఈ పరిస్థితే క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌ను కాంబ్లీకి సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కాంబ్లీ సైతం సాయం స్వీకరించేందుకు సిద్ధమని, రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చేరడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది.
1991-2000 కాలంలో పరుగుల వరద పారించిన కాంబ్లీ
కాంబ్లీ 1991లో వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి, 1993లో టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అప్పట్లో అతని ఆటతీరును చూసి ఆయనను భవిష్యత్తులో గొప్ప క్రికెటర్‌గా భావించారు. కానీ, అనేక కారణాల వల్ల తన కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నాడు. 1991-2000 కాలంలో పరుగుల వరద పారించిన కాంబ్లీ, 2000 నుంచి పూర్తిగా దిగి వెళ్లిపోయాడు, దీంతో టీమిండియాలో అతనికి స్థానమే దక్కలేదు. 2000లో షార్జాలో ఆడిన తర్వాత జట్టులోకి తిరిగి రావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.