Virat Kohli: కింగ్ కోహ్లీ ప్రస్థానానికి 15 ఏళ్లు.. రికార్డుల మోతతో అగ్రస్థానం
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటికి 15 ఏళ్లు పూర్తి అయింది. సరిగ్గా ఇదే రోజు 2008లో శ్రీలంకతో తొలి వన్డే ఆడారు. ఎన్నోసార్లు పరుగుల వరద పాటించి రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. టెస్టులు,వన్డేలు, టీ20లు ఇలా మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకూ 500 మ్యాచులను ఆడాడు.రికార్డులకు రారాజుగా బంతిని బాదడం విరాట్ కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. మొత్తం 25582 పరుగులు, 76 సెంచరీలతో గ్రేటెస్ట్ బ్యాటర్లలో ఒకరిగా కోహ్లీ నిలిచాడు. టీమిండియా తరుఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 2011 టెస్టులోకి, 2010లో టీ20ల్లోకి అడుగుపెట్టిన కోహ్లీ మూడుఫార్మాట్లో వందకు పైగా మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా అవతరించాడు.
213 మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ
ఇప్పటివరకు 111 టెస్టులు, 275 వన్డేలు, 115 టీ20ల్లో టీమిండియా తరుపున ఆడాడు. 2017, 2018 సీజన్లో వరుసగా 11 సెంచరీలు చేసి సత్తా చాటాడు. కోహ్లీ ఖాతాలో మోస్ట్ ఇంటర్నేషనల్ రన్స్, అత్యధిక వన్డే, టీ20 రన్స్, మోస్ట్ డబుల్ సెంచరీలు, మోస్ట్ సెంచరీలు, అత్యధిక ఐసీసీ రన్స్ వంటి ఎన్నో ఉన్నాయి. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లో కలిపి మొత్తం 213 మ్యాచులకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 135 మ్యాచుల్లో టీమిండియాను విజేతను నిలిపాడు.కెప్టెన్ గా 68 టెస్టుల్లో భారత్ ను 40 మ్యాచుల్లో గెలిపించాడు. అంచనాలకు తగ్గట్లుగానే కోహ్లీ అతి తక్కువ సమయంలోనే స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. 15 ఏళ్ల కాలంలో ఎన్నో మైలురాళ్లను అందుకోవడం విశేషం.