టీమిండియా విరాట్ కోహ్లీపైనే ఆధారపడి ఉంది: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్
టెస్టులో ఆల్ టైం సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీతో విభేదాలు కారణంగా 2022 జనవరిలో అర్ధాంతరంగా కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. వన్డేలో అత్యధిక విజయాల శాతం ఉన్న విరాట్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి, టీమిండియాలో బీసీసీఐ భారీ మార్పులను చేసింది. కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు 15 నిమిషాల ముందు మాత్రమే చెప్పారని గతంలో కోహ్లీ అవేదన వ్యక్తం చేశాడు. గంగూలీ దాన్ని ఖండించడంతో ఈ విషయం చాలా రోజులు చర్చ సాగింది. టెస్టులో విరాట్ కోహ్లీ రాణించాలని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ గంగూలీ కోరారు.
విరాట్ కోహ్లీ టెస్టులో రాణించాలి
విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంక, బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన భారత మాజీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ (49) రికార్డును సమం చేయడానికి కోహ్లీ కేవలం మూడు వన్డేల దూరంలో ఉన్నాడు ప్రస్తుతం విరాట్ పైనే టీమిండియా క్రికెట్ ఆధారపడి ఉందని, టెస్టులో ఫామ్‌లోకి వచ్చి శతకాల మోత మోగించాలని గంగూలీ చెప్పారు. ఆస్ట్రేలియా జట్టుపై రాణించాలంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో రాణించాలని, ఈ రెండు జట్లు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా టెస్టు సిరీస్ గెలవాలంటే కోహ్లీ ఫామ్‌లోకి రావాలని గంగూలీ చెప్పుకొచ్చాడు.