IPL 2025: కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌ను ఆశీర్వదించాలని.. అభిమానులకు విరాట్ కోహ్లీ ప్రత్యేక అభ్యర్థన
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జట్టు అభిమానులకు ఓ ముఖ్యమైన విజ్ఞప్తి చేశాడు.
తమ కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌కు పూర్తి మద్దతునిచ్చి, ఆశీర్వదించాలని అభిమానులను కోరాడు.
ఆర్‌సీబీ అన్‌బాక్సింగ్ ఈవెంట్‌లో మాట్లాడిన కోహ్లీ, రజత్ పాటిదార్ బృందానికి దీర్ఘకాలం నాయకత్వం వహిస్తారని నమ్మకంతో ఉన్నట్టు తెలిపాడు.
గత సీజన్లలో ఆర్‌సీబీకి ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వం వహించాడు. అయితే మెగా వేలానికి ముందు అతడిని జట్టు విడిచిపెట్టింది.
వేలంలోనూ అతడిని తిరిగి కొనుగోలు చేయలేదు. వేలం ముగిసిన అనంతరం రజత్ పాటిదార్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించారు.
వివరాలు
ప్రేక్షకులకు రజత్‌ను పరిచయం చేసిన విరాట్
"రజత్ పాటిదార్ ఎంతో ప్రతిభావంతుడు.అతని భుజాలపై పెద్ద బాధ్యత ఉంది.సుదీర్ఘ కాలం పాటు అతడు జట్టును ముందుకు నడిపే నాయకుడు అవుతాడు.అందుకే,మీరు ఆయనకు మీ ప్రేమను, మద్దతును చూపించండి.జట్టును విజయపథంలో నడిపించేందుకు అవసరమైన అన్ని వనరులు అతనికి అందుబాటులో ఉన్నాయి,"అని కోహ్లీ అన్‌బాక్సింగ్ ఈవెంట్‌లో స్పష్టం చేశాడు.
అనంతరం రజత్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే.
అభిమానుల అద్భుతమైన మద్దతు వల్లే ఇది సాధ్యమైందని చెబుతూ,ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు తనలో అదే ఉత్సాహం ఉరకలేస్తుందని వ్యాఖ్యానించాడు.
ఈసారి కూడా బృందంలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని,వారితో కలిసి ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.
వివరాలు
"కెప్టెన్సీ గొప్ప గౌరవం" - రజత్ పాటిదార్
ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు రజత్ పాటిదార్ పేర్కొన్నాడు.
"కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన జట్టుకు నాయకత్వం వహించడం గర్వకారణంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఆర్‌సీబీపై నాకు ఎనలేని ప్రేమ ఉంది. వీరి ఆటను చూస్తూ పెరిగాను. ఇప్పుడు జట్టును ముందుండి నడిపించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తాను" అని రజత్ పాటిదార్ ధీమాగా చెప్పాడు.