Virat Kohli: ఐపీఎల్ ముందే కోహ్లీ స్టైలిష్ అవతారం.. టాటూ వెనుక భావం ఏంటో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా ప్రముఖ బ్యాట్స్‌మన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు తన స్టైల్‌ను మార్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. తన ఎడమ చేతిపై పూర్తిగా కవర్ అయ్యేలా కొత్త ఫుల్ స్లీవ్ టాటూను వేయించుకున్నాడు. ముంబైలో ఉన్న ప్రసిద్ధ 'ఏలియన్స్ టాటూ ఇండియా' స్టూడియోలో ఈ టాటూను చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆ స్టూడియో తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోవడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.
వివరాలు
టాటూ అర్థం అదేనా?
రేపటి నుంచి ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ ముఖ్యమైన టోర్నమెంట్‌కు ముందు కోహ్లీ వేసుకున్న ఈ టాటూ ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ఈ టాటూ వెనుక ఉన్న భావాన్ని 'ఏలియన్స్ టాటూ' స్టూడియో తమ వెబ్‌సైట్‌లో వివరించింది. ఇది సాధారణ టాటూ కాదని, కోహ్లీ వ్యక్తిత్వంలో జరిగిన మార్పులు, అతని జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే ఒక ప్రతీక అని పేర్కొంది. అతను వ్యక్తిగా ఎలా ఎదిగాడో, ఎలాంటి మార్పులు ఎదుర్కొన్నాడో ఈ టాటూ చూపిస్తుంది.
వివరాలు
కోహ్లీ జీవితం గురించి చెబుతూ టాటూ
జీవితంలో ప్రతి దశలో క్రమశిక్షణ, ఏకాగ్రత, దృఢ నమ్మకంతో పాత అలవాట్లు, ఆలోచనలను విడిచిపెట్టి, కొన్ని విలువలను మరింత బలపరచుకుని, కొత్త విశ్వాసాలను స్వీకరించాడని వివరించింది. ఈ సమగ్ర మార్పులన్నింటినీ ఈ టాటూ సూచిస్తుందని తెలిపింది. కోహ్లీ ఎడమ చేయి పూర్తిగా కొత్తది కాదని, ఇప్పటికే అక్కడ వివిధ దశల్లో వేయించుకున్న పాత టాటూలు ఉన్నాయని ఆర్టిస్టులు చెప్పారు. కొన్ని పాత టాటూలను పూర్తిగా కవర్ చేసి, ఇంకొన్నింటిని మెరుగుపరచి, కొత్త డిజైన్‌లను జోడించి, ఒకే కథను చెప్పేలా ఈ ఫుల్ స్లీవ్ టాటూను రూపొందించినట్లు తెలిపారు. పాత, కొత్త టాటూల కలయిక ద్వారా అతని జీవిత ప్రయాణాన్ని స్పష్టంగా చూపించేలా దీనిని రూపకల్పన చేసినట్లు వెల్లడించారు.