Virat Kohli: ఆర్సీబీ టైటిల్ వెనుక అసలు నిజాన్ని బయటపెట్టిన విరాట్ కోహ్లీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) విజేతగా నిలవడంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) పాత్ర అత్యంత కీలకంగా మారింది. బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించిన అతడు మైదానంలోనూ దూకుడైన ఆటతీరును ప్రదర్శించాడు. గుజరాత్ టైటాన్స్‌పై ఫైనల్‌లో 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు రెండో ఐపీఎల్ కప్పును అందించాడు. విజయం అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఇప్పుడున్న యువ ఆటగాళ్లే జట్టును మరింత ముందుకు తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించాడు. కప్పు గెలవడం ప్రతి ఆటగాడి కల. అలాంటి క్షణాలు ఎక్కువసార్లు రావాలని కోరుకుంటాం. ఐపీఎల్ టైటిల్‌ను గెలిచే సమయంలో చివరి వరకు క్రీజ్‌లో ఉండి విజయాన్ని ఖాయం చేసే పరుగులు చేయాలన్నది నా కల.
వివరాలు
యువ ఆటగాళ్ల ప్రేరణే ప్రధాన కారణం
ఈసారి అది నెరవేరిందని తెలిపాడు. ఈ విజయానికి ప్రత్యేకమైన కొత్త వ్యూహాలు ఏమీ అనుసరించలేదని, తాము పూర్తిగా రిలాక్స్‌గా, కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగామని కోహ్లీ స్పష్టం చేశాడు. తాము అనుకున్న ఆటతీరునే మైదానంలో అమలు చేశామని చెప్పాడు. తన వేగవంతమైన హాఫ్ సెంచరీ వెనుక యువ ఆటగాళ్ల ప్రేరణే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. సూపర్ యంగ్ ప్లేయర్లు మనల్ని నిరంతరం ముందుకు నడిపిస్తారు. అందుకే ఆటను ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తుందని అన్నాడు. మోడ్రన్ క్రికెట్‌లో ఎప్పుడైనా అదనంగా 20 నుంచి 30 పరుగులు సాధించాలన్న ఆలోచనతోనే ఆడుతున్నానని కోహ్లీ వివరించాడు. తన ఆటతీరు పూర్తిగా మార్చుకోలేదని, కానీ మైండ్‌సెట్‌లో మార్పు చేసుకున్నానని తెలిపాడు.
వివరాలు
ఎల్లప్పుడూ అత్యుత్తమ క్రికెట్ ఆడడమే లక్ష్యం
బౌలర్లపై ఆధిపత్యం చూపించేందుకు భారీ షాట్లు కొట్టేందుకు వెనుకాడనని, ప్రత్యర్థి ఎవరి బెస్ట్ బౌలర్ అయినా సరే ఎదుర్కొని పరుగులు సాధించాలన్నదే తన ఆలోచన అని చెప్పాడు. జట్టు విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. గత సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ఈసారి భారీ అంచనాలు ఉన్నాయని, అయినా ఒక్కో లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగినట్లు కోహ్లీ తెలిపాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే మొదటి లక్ష్యమని, దాన్ని సాధించామని చెప్పాడు. ఫైనల్‌లో ప్రత్యర్థి ఎవరు అన్నది తమకు ముఖ్యం కాదని, ఎల్లప్పుడూ అత్యుత్తమ క్రికెట్ ఆడడమే లక్ష్యమని స్పష్టం చేశాడు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని, ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు ముందుకు వచ్చి జట్టును గెలిపించారని కోహ్లీ గుర్తుచేశాడు.
వివరాలు
వరుసగా రెండోసారి గెలవడం ఆనందంగా ఉంది
తాను త్వరగా ఔటైనా సరే జట్టు విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకు ఎప్పుడూ ఉందని తెలిపాడు. ఈ విజయానికి పూర్తి క్రెడిట్ మేనేజ్‌మెంట్‌కే చెందుతుందని, సరైన ఆటగాళ్ల ఎంపిక, వారికి స్వేచ్ఛ ఇవ్వడం, నమ్మకం ఉంచడం వల్లే వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవగలిగామని పేర్కొన్నాడు. అభిమానుల మద్దతును కూడా కోహ్లీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ సీజన్‌లో ఐదు హోం మ్యాచ్‌లు ఆడగా, అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లోనూ భారీగా ఆర్సీబీ అభిమానులే కనిపించారని చెప్పాడు. వారి అపారమైన మద్దతే తమ విజయానికి ప్రధాన బలమని, ఆ అభిమాన విలువను మాటల్లో చెప్పలేమని కోహ్లీ వ్యాఖ్యానించాడు.