వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?
ఇండియా, వెస్టిండీస్ మధ్య టెస్టు మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరుగుతున్న రెండో మ్యాచులో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 121పరుగులు సాధించి విదేశీ గడ్డపై ఐదేళ్ళ తర్వాత వంద పరుగుల మార్కును అందుకున్నాడు. విరాట్ కోహ్లీ సెంచరీ కారణంగా ఇండియా స్కోరు 438పరుగులకు చేరుకుంది. సెంచరీ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన విరాట్, ఐదేళ్ళ తర్వాత విదేశీ గడ్డపై సెంచరీ చేయడం ఆనందాన్ని ఇచ్చిందని, విదేశాలపై తనది చెత్త రికార్డు కాదనీ, ఇప్పటివరకు 15సెంచరీలు విదేశాల్లో చేసినట్లు చెప్పుకొచ్చాడు. విండీస్ పై తాజాగా చేసిన సెంచరీతో టెస్ట్ కెరీర్లో 29వ సెంచరీని సాధించాడు కోహ్లీ.
ఆ మైదానాలంటే ఇష్టమంటున్న కోహ్లీ
స్వదేశంలో కంటే విదేశాల్లోనే తన సెంచరీలు ఎక్కువగా ఉన్నాయని విరాట్ కోహ్లీ మాట్లాడారు. బ్యాటింగ్‌కి దిగినపుడు హాఫ్ సెంచరీ పూర్తి చేస్తే సెంచరీ కోసం ప్రయత్నం చేస్తానని, 120 పరుగులు దాటితే డబుల్ సెంచరీ కోసం ఆలోచిస్తాననీ కోహ్లీ అన్నారు. తాను చేసే పరుగులు ఇండియా టీమ్ ను విజయపథంలోకి నడిపించాలని కోరుకుంటానని కోహ్లీ చెప్పుకొచ్చారు. ఇంకా, తనకు విదేశాల్లోని కొన్ని మైదానాలపై ఆడటం బాగా ఇష్టమని వాటి పేర్లు బయటపెట్టాడు. విండీస్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మైదానం, అటింగ్వా స్తేడియం, ఆస్ట్రేలియాలోని అడిలైడ్ మైదానం, దక్షిణాఫ్రికాలోని బుల్ రింగ్ మైదానాలపై ఇష్టంగా ఆడతానని తెలియజేసారు.