Virender Sehwag: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై వీరేంద్ర సెహ్వాగ్ అనాసక్తి.. కారణం ఏంటో తెలుసా..?
మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియా హెడ్ కోచ్ పదవిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని తెలిపారు. ఇటీవల ఓ టివి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, క్రికెటర్‌గా 15ఏళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్నానని, హెడ్ కోచ్ పదవి చేపడితే మరోసారి అదే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. తన కుటుంబానికి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో,సెహ్వాగ్ టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టే ఆలోచనలో లేరని చెప్పారు. అయితే,ఐపీఎల్ టీమ్ కోచ్ లేదా మెంటార్‌గా అవకాశం వస్తే మాత్రం వదులుకోనని స్పష్టం చేశారు. సెహ్వాగ్ గతంలో, 2017లో టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసినప్పటికీ, అప్పటి క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) రవిశాస్త్రిని హెడ్ కోచ్‌గా నియమించింది.
టీమిండియా హెడ్ కోచ్‌గా వెళ్తే వారిని ట్రైన్ చేయడం కష్టం
ఆ తర్వాత సెహ్వాగ్ ఆ పదవికి మరోసారి దరఖాస్తు చేయలేదు. తన పిల్లల గురించి మాట్లాడిన సెహ్వాగ్, 14, 16 ఏళ్ల వయస్సులో ఉన్న వారిద్దరూ క్రికెట్ ఆడుతున్నారని, ఒకరు ఆఫ్ స్పిన్నర్ కాగా, మరొకరు ఓపెనింగ్ బ్యాటర్ అని తెలిపారు. వారిని ట్రైన్ చేయడం కోసం తన అవసరం ఉందని, అందుకే హెడ్ కోచ్ పదవికి దూరంగా ఉంటున్నానని చెప్పారు. సెహ్వాగ్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2014-15 సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన ఆయన, 2016లో ఆ జట్టులో కోచింగ్ స్టాఫ్‌గా మెంటార్‌గా చేరారు. 2018 వరకు క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేసిన సెహ్వాగ్, ఆ తర్వాత నుంచి కోచ్ లేదా మెంటార్ పదవికి దూరంగా ఉంటున్నాడు.