విరాట్ కోహ్లీని మరోసారి కెప్టెన్ గా చూడాలని ఉంది : రవిశాస్త్రి
ఇండియన్ ప్రీమియర్ 2023 సీజన్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. వరుస హాఫ్ సెంచరీలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 142.30 స్ట్రెక్‌రేట్‌తో 333 పరుగులు చేశాడు. టీమిండియా క్రికెట్లో విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి కోసం అప్పటి మాజీ కోచ్ అయిన అనిల్ కుంబ్లేతో గొడవ పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా కోహ్లీపై టీమిండియా మాజీ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీని ఇంకోసారి కెప్టెన్ గా చూడాలని ఉందని తెలియజేశారు.
ఆర్సీబీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ
గతేడాది ఇంగ్లండ్ తో జరిగిన చివరి టెస్టులో రోహిత్ కోవిడ్ వల్ల మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో బుమ్రాకు కెప్టెన్సీ పగ్గాలు అందజేశారు. అప్పట్లో ఆ మ్యాచ్ కు విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇస్తారని భావించానని, తాను ఉండి ఉంటే మాత్రం కచ్చితంగా విరాట్ కే మరోసారి కెప్టెన్సీ ఇచ్చేవాడినని రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఎందుకంటే అంతకుముందు ఏడాది జరిగిన నాలుగు టెస్టులో టీమిండియా 2-1 లీడ్ సాధించినప్పుడు కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడని రవిశాస్త్రి గుర్తు చేశాడు. ఇక ఐపీఎల్లో డుప్లెసిస్ గాయపడటంతో ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్స్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.