Loading...
David Warner: మేం తప్పు ఒప్పుకున్నాం.. జీవితకాలం నిందలు భరిస్తున్నాం: డేవిడ్ వార్నర్!
మేం తప్పు ఒప్పుకున్నాం.. జీవితకాలం నిందలు భరిస్తున్నాం: డేవిడ్ వార్నర్!

David Warner: మేం తప్పు ఒప్పుకున్నాం.. జీవితకాలం నిందలు భరిస్తున్నాం: డేవిడ్ వార్నర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2026
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా క్రికెట్‌లో 2018 నాటి 'శాండ్‌పేపర్ గేట్' కుంభకోణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ 'సబ్ర'లో ఈ వివాదాన్ని ప్రస్తావించడంతో మరోసారి చర్చ మొదలైంది. తాజాగా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ప్రస్తుత టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఖవాజాను కమిన్స్ బలిపశువును చేశాడని, అతడి తీరు తనను తీవ్రంగా నిరాశపరిచిందని మండిపడ్డాడు.

వివరాలు

ఖవాజాను బలిపశువును చేశాడు: వార్నర్

సిడ్నీలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ ప్రణాళిక గురించి తనకు ఏమాత్రం తెలియదని స్పష్టం చేశాడు.

ఈ వ్యాఖ్యలపై ఫాక్స్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన వార్నర్ తీవ్రంగా స్పందించాడు. 'ఉస్మాన్ ఖవాజా తన పుస్తకంలో రాసిందే నిజం.

నేను అతడికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. కానీ ఈ రోజు కెప్టెన్ (కమిన్స్) ప్రెస్‌మీట్ చూశాక.. అతడు ఖవాజాను బలిపశువును చేశాడని అనిపించింది.

ఇది నన్ను చాలా నిరాశపరిచింది' అని వార్నర్ పేర్కొన్నాడు.

వివరాలు

బాల్ ట్యాంపరింగ్ విషయం అందరికీ తెలుసు!

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఉస్మాన్ ఖవాజా.. తన ఆత్మకథలో బాల్ ట్యాంపరింగ్ విషయం జట్టులోని అందరికీ తెలుసని ప్రస్తావించాడు.

సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై స్పందించాడు. 'ఆ విషయం అందరికీ తెలుసనే నిజాన్ని నేను కాదనను' అని పోస్ట్ చేశాడు.

అయితే నాటి క్రికెట్ ఆస్ట్రేలియా విచారణలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ మాత్రమే దోషులుగా తేలారు.

ADVERTISEMENT

వివరాలు

మేం ముగ్గురం జీవితకాల శిక్ష అనుభవిస్తున్నాం!

ఈ వివాదం కారణంగా తాము ముగ్గురం భారీ మూల్యం చెల్లించుకున్నామని వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'మేం ముగ్గురం దీనికి పెద్ద మూల్యం చెల్లించుకున్నాం.

ప్రతిరోజూ నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్నాం. మేం తప్పు ఒప్పుకున్నాం. కానీ మాపై జీవితకాల శిక్ష పడింది. ఆ సమయంలో నా భార్య గర్భస్రావానికి గురైంది. మాకు పుట్టబోయే బిడ్డను కోల్పోయాం.

అందుకే ఈ విషయం నన్ను తీవ్రంగా బాధిస్తుంది. అసలు నిజం బయటకు వచ్చే వరకు ఇది ఇలాగే ఉంటుందని వార్నర్ ఉద్వేగంగా చెప్పాడు.

ADVERTISEMENT

వివరాలు

నాటి విచారణపైనా వార్నర్ అసంతృప్తి

2018లో జరిగిన విచారణ కూడా తప్పులతడకగా, తొందరపాటుతో ముగిసిందని వార్నర్ ఆరోపించాడు. 'ఆ విచారణను హడావుడిగా ముగించేశారు.

బాధ్యతను మా ముగ్గురిపై నెట్టేసి చేతులు దులుపుకున్నారు. మళ్లీ మాట్లాడే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. బహుశా ఈ వివాదం తర్వాత తెరవెనుక కొన్ని చర్చలు జరగవచ్చని వ్యాఖ్యానించాడు.

వార్నర్ తాజా వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. 2018 నాటి బాల్ ట్యాంపరింగ్ వివాదం ఏడేళ్లకు పైగా గడిచినా ఇంకా చర్చకు దారితీస్తుండటం గమనార్హం.

ADVERTISEMENT