Page Loader
ENG vs IND: 'మేం ఏం స్టుపిడ్స్‌ కాదు'.. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌పై ట్రెస్కోథిక్ స్పష్టత!
'మేం ఏం స్టుపిడ్స్‌ కాదు'.. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌పై ట్రెస్కోథిక్ స్పష్టత!

ENG vs IND: 'మేం ఏం స్టుపిడ్స్‌ కాదు'.. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌పై ట్రెస్కోథిక్ స్పష్టత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2025
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా దూసుకుపోతున్నది. ఇంగ్లండ్‌కు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్‌.. ఇప్పటికే మూడు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఇప్పుడిప్పుడే డ్రా గానీ, భారత్ గెలుపు గానీ ఫలితం ఎలా వాస్తవమవుతుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Details

ఒక్కరోజులో 536 పరుగులు చేయాలా?

ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ గెలవాలంటే తుది రోజు 536 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాటర్లను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు నిలకడతో ఆడి మ్యాచ్‌ను డ్రాగా మార్చే దిశగా పోతుందా? లేక తమదైన 'బజ్‌బాల్‌' ధోరణిని కొనసాగిస్తూ విజయం కోసం పోరాడుతుందా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

Details

ట్రెస్కోథిక్ వ్యాఖ్యలు - స్టుపిడ్‌లం కాదు!

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ స్పందిస్తూ ఇది సాధ్యం కాని లక్ష్యమని మేం ముందే అంచనా వేశాం. భారత్‌ 550 పరుగుల లక్ష్యం పెడుతుందని ఊహించాం. కానీ వారు దాన్ని మించి 600కి పైగా స్కోరు చేశారు. మేం డ్రా కూడా ఆలోచించని స్థాయిలో స్టుపిడ్‌లు కాదు. ముగింపులు మూడు రకాలే - గెలుపు, ఓటమి లేదా డ్రా. అయితే, ప్రస్తుతం మేము ఎలా బ్యాటింగ్ చేస్తామన్నదే కీలకం. పాజిటివ్ ఫలితమే లక్ష్యంగా మా ఆట కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. అలాగే, భారత్ ఇన్నింగ్స్‌లో బంతి సాఫ్ట్‌గా మారిన సమయంలో 10-15 ఓవర్ల పాటు ఎక్కువగా బౌలింగ్ చేయాల్సిన అవసరం వచ్చిందని ట్రెస్కోథిక్ వివరించారు.

Details

హ్యారీ బ్రూక్ వ్యాఖ్యలకు భిన్నంగా స్పందన

తాము డిక్లరేషన్ కోసం ఎదురు చూస్తుండగా భారత్ వేగంగా పరుగులు చేసి భారీ స్కోరు సాధించిందని పేర్కొన్నారు. ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ గతంలో భారత్ ఎంత లక్ష్యం పెట్టినా చేధిస్తామని ధీమాగా చెప్పగా, ట్రెస్కోథిక్ మాత్రం చాలా యథార్థవాది వ్యాఖ్యలే చేశాడు. బలమైన లక్ష్యాన్ని తాము ఎలా ఎదుర్కొంటామన్నదానిపై స్పష్టతనిచ్చారు. వర్షం వస్తే.. ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అవకాశాలు? ఇదిలా ఉంటే, ఐదో రోజు వాతావరణం ఇంగ్లండ్‌కు అనుకూలంగా మారవచ్చన్న అంచనాలు ఉన్నాయి. వర్షం పడే సూచనలు ఉండటంతో మ్యాచ్ నిలిచిపోతే, ఆ జట్టు డ్రా దిశగా ప్రయాణించవచ్చు. ఆక్యువెదర్ ప్రకారం మ్యాచ్‌ ప్రారంభానికి ఒక గంట ముందు తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది.

Details

 మ్యాచ్‌ ప్రారంభ సమయం

భారత కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు, ఇంగ్లండ్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఆరంభం కానుంది. మ్యాచ్‌ చివరి రోజు ఎలా మలుపుతీసుకుంటుందో చూడాలి మరి - భారత్ అద్భుత విజయాన్ని ఖాయం చేసుకుంటుందా? లేక ఇంగ్లండ్ త్రుటిలో తప్పించుకుంటుందా?