ఆసియా కప్ ను బహిష్కరిస్తాం.. ఏసీసీకి పాక్ బోర్డు బెదిరింపులు
తమ దేశం నుంచి తరలిపోతున్న ఆసియా కప్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొండి వైఖరి వీడటం లేదు. ఈ టోర్నిలో కొన్ని మ్యాచ్ లైనా తమ దేశంలో నిర్వహించాలని పీసీబీ పట్టుబడుతోంది. మొదటి రౌండ్ లోని నాలుగు మ్యాచ్ లైనా పాక్ లో ఆడించకుంటే ఆసియా కప్ లో తమ జట్టు ఆడదని, ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి కూడా వైదొలుతామని పీసీబీ బెదిరింపులకు పాల్పడుతోంది. సెప్టెంబర్ లో ఆసియా కప్ కు పాక్ ఆతిథ్యమివ్వాలి. భద్రతా కారాణాల వల్ల టీమిండియాను పాక్ కు పంపేందుకు బీసీసీఐ ఒప్పుకోలేదు. భారత్ జట్టు మ్యాచులు దుబాయ్ లో, మిగిలిన మ్యాచులు పాక్ లో నిర్వహించేలా పీసీబీ అప్పట్లో హైబ్రిడ్ మోడల్ ను తీసుకొచ్చింది.
ఆసియా క్రికెట్ నుంచి వైదొలుగుతామన్న పాక్ బోర్డు
హైబ్రిడ్ మోడల్ నిర్ణయాన్ని సభ్య దేశాలు అంగీకరించలేదు. ఇక టోర్నీని పాక్ నుంచి తరలించి శ్రీలంకలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించుకుంది. దీన్ని పాక్ బోర్డు వ్యతిరేకించింది. తమ దేశంలో కాకుంటే యూఏఈలో నిర్వహించాలని, శ్రీలంకలో జరిపేందుకు తాము అంగీకరించమని పాక్ బోర్డు స్పష్టం చేసింది. ఏసీసీ తమ ప్రతిపాదనను అంగీకరించకపోతే ఆసియా కప్ లో పాక్ జట్టు ఆడదని, ఏకంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి తమ దేశం కూడా వైదొలగుతామని కూడా సౌథీ స్పష్టం చేశాడని ఓ పీసీబీ అధికారి తెలిపారు.