LOADING...
నేడు భారత్‌ వెస్టిండీస్‌ రెండో టీ20.. విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్న టీమిండియా
విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్న టీమిండియా

నేడు భారత్‌ వెస్టిండీస్‌ రెండో టీ20.. విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్న టీమిండియా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 06, 2023
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా- వెస్టిండీస్ మధ్య ఆదివారం రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది.కేవలం 4 పరుగుల తేడాతో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు, ఆదివారం జరిగే పోరులో నెగ్గాలని పట్టుదలతో ఉంది. ఈ మేరకు జట్టులోకి మరో బ్యాటర్‌ను అదనంగా తీసుకోవాలని భావిస్తోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా తొలి టీ-20లో అనూహ్యంగా ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలోనే రెండో మ్యాచ్‌లో బలంగా పుంజుకోవాలని ఉవ్విళూరుతోంది. ఓవైపు బౌలర్లు సత్తాచాటినా, మరోవైపు బ్యాటర్ల వైఫల్యంతో మ్యాచ్ ఓడిపోయింది. గత 7 ఏళ్లుగా కరేబియన్ జట్టు భారత్‌పై వరుసగా రెండు టీ-20ల్లో విజయం సాధించకపోవడం గమనార్హం. గిల్‌, ఇషాన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, సంజూశాంసన్‌ దూకుడుగా రాణించాలని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

details

బౌలింగ్‌, బ్యాటింగ్‌కు సమంగా సహకరించనున్న పిచ్‌ 

తొలి మ్యాచ్‌లో తెలంగాణ యంగ్ స్టర్ తిలక్‌ వర్మ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదురగొట్టాడు. ఐపీఎల్‌ హీరో యశస్వి జైస్వాల్‌కు రెండో టీ20లో ఆడే అవకాశం దక్కనుంది. మరోవైపు రెండో టీ-20లో గయానా పిచ్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌కు సమంగా సహకరించనుంది. గతంలో ఇక్కడ 5 టీ-20 మ్యాచ్‌లు నిర్వహించారు. అందులో రెండు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో చేజింగ్‌ చేసిన జట్టునే విజయం వరించింది. తుది జట్లు (అంచనా) : వెస్టిండీస్‌ : పావెల్‌ (కెప్టెన్‌), కింగ్‌, మయేర్స్‌, చార్లెస్‌, పూరన్‌, హెట్‌మైర్‌, హోల్డర్‌, షెఫర్డ్‌, అకీల్‌, జోసెఫ్‌, మెక్‌కాయ్‌. టీమిండియా : హార్దిక్‌ పాండ్యా(కెప్టెన్‌), గిల్‌, ఇషాన్‌, యశస్వి, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, శాంసన్‌, అక్షర్‌, కుల్దీప్‌/చాహల్‌, అర్ష్‌దీప్‌, ముఖేశ్‌.