LOADING...
Test Twenty: టెస్ట్ + టీ20 కలయికతో కొత్త ఫార్మాట్…కొత్త క్రికెట్ ఫార్మాట్ 'టెస్ట్ 20' సిద్ధం! 
కొత్త క్రికెట్ ఫార్మాట్ 'టెస్ట్ 20' సిద్ధం!

Test Twenty: టెస్ట్ + టీ20 కలయికతో కొత్త ఫార్మాట్…కొత్త క్రికెట్ ఫార్మాట్ 'టెస్ట్ 20' సిద్ధం! 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2025
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది."టెస్ట్ 20" పేరుతో సరికొత్త ఫార్మాట్‌ను తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెస్ట్ మ్యాచ్‌లా రెండు ఇన్నింగ్స్ ఉండగా, టీ20 తరహాలో వేగంగా సాగబోయే ఈ కొత్త రూపం అభిమానులకు వినూత్న అనుభూతిని ఇవ్వబోతోంది. ఈ ఫార్మాట్‌లో రెండు జట్లు ఒకే రోజున తలో 20 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లు ఆడతాయి. అంటే మొత్తం 80 ఓవర్లు ఒకే రోజు పూర్తవుతాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ టెస్ట్ తరహాలో జరుగుతాయి, కానీ టీ20 స్పీడ్‌లో సాగుతాయి.

వివరాలు 

జూనియర్ టెస్ట్ 20 ఛాంపియన్షిప్

2026 జనవరిలో "జూనియర్ టెస్ట్ 20 ఛాంపియన్షిప్" పేరుతో తొలి సీజన్ ప్రారంభం కానుందని ఈ ఫార్మాట్ స్థాపకుడు గౌరవ్ బహిర్వాణి వెల్లడించారు. ఈ లీగ్‌కి లెజెండరీ ప్లేయర్స్ అయిన ఏబీ డివిలియర్స్, హర్భజన్ సింగ్, మ్యాథ్యూ హెడెన్, అలాగే క్లైవ్ లాయిడ్ సలహాదారులుగా వ్యవహరించనున్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

వివరాలు 

టెస్ట్ 20 ఫార్మాట్‌ రూల్స్ 

క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి, ఒకే రోజున మొత్తం 80 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఒక్క జట్టు మొదట 20 ఓవర్ల తొలి ఇన్నింగ్స్ ఆడి, తర్వాత మరోసారి 20 ఓవర్ల రెండో ఇన్నింగ్స్ ఆడుతుంది. ఆ తరువాత ప్రత్యర్థి జట్టు కూడా అదే విధంగా రెండు ఇన్నింగ్స్‌లలో తలో 20 ఓవర్లు ఆడుతుంది. ఇలా ఒకే రోజున టెస్ట్ తరహా మ్యాచ్ పూర్తి అవుతుంది. కాలం మారిన కొద్దీ క్రీడల రూపం కూడా మారుతూనే ఉంది. ప్రేక్షకులు వేగవంతమైన ఆటలను ఇష్టపడుతున్న దృష్ట్యా, ఈ కొత్త ఫార్మాట్‌ను ప్రవేశపెడుతున్నారు. టెస్ట్ మ్యాచ్‌లలో ఉన్న క్రమశిక్షణ, టీ20లలోని ఎంటర్టైన్‌మెంట్ — ఈ రెండింటినీ మిళితం చేసే ప్రయత్నమే టెస్ట్ 20 అని చెప్పొచ్చు.

వివరాలు 

ఐపీఎల్‌ను బీట్ చేయడం అంత సులభం కాదు! 

క్రికెట్ ప్రపంచంలో ఎన్ని కొత్త లీగులు వచ్చినా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) స్థానం మాత్రం ప్రత్యేకమే. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడే క్రికెట్ టోర్నమెంట్‌గా ఐపీఎల్ దాదాపు 18 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. వరల్డ్ కప్ కంటే ఎక్కువ ఉత్సాహంతో అభిమానులు ఐపీఎల్‌ను ఆస్వాదిస్తారు. టెన్ ఓవర్స్ మ్యాచ్‌లు, ఇతర దేశాల లీగులు వచ్చినా, ఐపీఎల్ స్థాయిని చేరుకోలేకపోయాయి. కానీ "టెస్ట్ 20" రూపంలో వస్తున్న ఈ కొత్త ఆలోచన క్రికెట్ అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేపుతుందనే చెప్పొచ్చు.