
Radhika Yadav: నేషనల్ టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ ను హత్య చేసిన తండ్రి.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో హృదయవిదారకమైన సంఘటన చోటు చేసుకుంది. జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్‌ను ఆమె తండ్రి దీపక్ యాదవ్ స్వయంగా తుపాకీతో ఐదు రౌండ్లు కాల్చి హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గురుగ్రామ్‌లోని సుషాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో రాధికా నివసిస్తున్న ఇంటి వద్ద ఈ ఘటన జరిగింది. తుపాకీ గాయాలతో తీవ్రంగా గాయపడిన రాధికను ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోలీసులు ఆమె ఇంటిని సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. రాధిక ఒక టెన్నిస్ అకాడమీ నిర్వహిస్తున్నట్టు సమాచారం.
వివరాలు
హత్యకు ఉపయోగించిన తుపాకీ పోలీసులు స్వాధీనం
ప్రాథమిక విచారణలోనే నిందితుడు దీపక్ యాదవ్ తన కుమార్తెను కాల్చిచంపిన విషయాన్ని అంగీకరించాడు. మొదటి అంతస్తులో నివసిస్తున్న దీపక్ సోదరుడు కూడా ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాధికా టెన్నిస్ అకాడమీ నడుపుతున్నదానిపై దీపక్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం, అకాడమీని మూసివేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకురావడం వల్లే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది.
వివరాలు
రాధికా యాదవ్ ఎవరు?
రాధికా యాదవ్ 2000 మార్చి 23న జన్మించారు. ఆమె టెన్నిస్ క్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక టోర్నీల్లో విజయం సాధించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ITF) డబుల్స్ విభాగంలో 113వ ర్యాంక్ సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో డబుల్స్ కేటగిరీలో టాప్ 200లో చోటు దక్కించుకున్నారు. హరియాణా రాష్ట్ర మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె ఐదో స్థానంలో నిలిచారు. రాధికకు శిక్షణ ఇచ్చిన ఆమె మాజీ కోచ్ మనోజ్ భారద్వాజ్ ఆమె మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఆమె చాలా క్రమశిక్షణతో కూడిన క్రీడాకారిణి. ఆమె ధ్యేయంపై ఎల్లప్పుడూ దృష్టి సారించేది. ఆమెను కోల్పోవడం మనమంతా ఓ పెద్ద నష్టంగా భావించాలి" అంటూ భావోద్వేగంతో స్పందించారు.