Page Loader
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ వరుస ఓటములకు కారణం ఏమిటి?
సన్‌రైజర్స్‌ హైదరాబాద్ వరుస ఓటములకు కారణం ఏమిటి?

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ వరుస ఓటములకు కారణం ఏమిటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆ టీం మీద చాలా ఆశలే పెట్టుకున్నారు . "ఒక్కసారి ఆరెంజ్ జెర్సీ బరిలోకి దిగితే రికార్డులు కురిపిస్తారని.. ఈసారి అయితే ఏకంగా 300 పరుగులతో ఐపీఎల్‌'లో నయా రికార్డు ఖాయం అని ధీమాతో ఉన్నారు. అయితే ఆ ఆశలు త్వరగా గాలిలో కలిసిపోయాయి. ఐదు మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి... కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి, పాయింట్స్ పట్టికలో చివరి స్థానంలో నిలిచింది ఎస్‌ఆర్‌హెచ్. 200 పరుగుల స్కోరు కూడా సాధించలేక పోతుంది.

వివరాలు 

గత సీజన్ రికార్డులు.. ఈ సారి మాయమయ్యాయా? 

గత సీజన్‌లో సన్‌రైజర్స్ మూడు మ్యాచ్‌లలో 250 కంటే ఎక్కువ పరుగులు చేసింది. ఓ మ్యాచ్‌లో ఏకంగా 287 పరుగులు కొట్టి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. ఫైనల్ వరకు వెళ్లి ఓడిపోయినా, బ్యాటింగ్ దూకుడు మాత్రం అభిమానులను ఆకట్టుకున్నది. ఈసారి తొలి మ్యాచ్‌లోనే 286 పరుగులు చేసి భారీ విజయం నమోదు చేయడంతో అదే జోరు కొనసాగుతుందని అనుకున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి బ్యాటర్లు బలమైన బ్యాటింగ్ లైన్‌అప్‌తో అభిమానులను, విశ్లేషకులను ఆశాజనకంగా మార్చారు. కానీ ఆ ఊపు మొదటి మ్యాచ్‌కే పరిమితమైంది.

వివరాలు 

ఫ్రాంచైజీలో మార్పులు - స్థిరంగా లేకపోవడమే కారణమా? 

2008 నుంచి 2012 వరకు డెక్కన్ చార్జర్స్ పేరిట ఉన్న ఈ జట్టు, తర్వాత సన్ గ్రూప్ చేతుల్లోకి వెళ్లి "సన్‌రైజర్స్ హైదరాబాద్"గా మారింది. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో ట్రోఫీ గెలుచుకుంది. 2018లో విలియమ్సన్ నాయకత్వంలో రన్నరప్‌గా నిలిచింది. ఇటీవలి కాలంలో నాయకత్వ మార్పులు గందరగోళానికి దారితీశాయి. 2023 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను 20.5 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించగా, అతని నాయకత్వంలో జట్టు పుంజుకుంది. 2024లో 2020 తర్వాత మొదటిసారిగా ప్లే ఆఫ్స్‌కు చేరి రన్నరప్ అయింది.

వివరాలు 

రిటెయిన్ చేసిన స్టార్ ఆటగాళ్లు 

ఈ సీజన్‌కి ముందు కమిన్స్ (రూ.18 కోట్లు),హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు (తలదాల్చి రూ.14 కోట్లు చొప్పున), స్థానిక కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు రిటెయిన్ చేశారు. గత సీజన్‌లో ట్రావిస్ హెడ్ 567 పరుగులు (స్ట్రైక్ రేట్ 190+), అభిషేక్ 484 పరుగులు (స్ట్రైక్ రేట్ 200+) చేయడం వల్ల వారి పట్ల నమ్మకం పెరిగింది. ఈసారి ఏమైంది? - బౌలింగ్ బలహీనతలే ప్రధాన సమస్య భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు వ్యాఖ్యానించినట్టు,సన్‌రైజర్స్‌కు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల బౌలర్లు లేరు. వారు ఆగ్రెసివ్‌గా కాకుండా డిఫెన్సివ్ మూడ్‌లో బౌలింగ్ చేస్తున్నారు.ఇది ప్రత్యర్థులకు పరుగులు చేయడానికి మార్గం వేసింది.

వివరాలు 

విశ్లేషకుల విశ్లేషణ - నోయల్ డేవిడ్, మోహన్ కామెంట్స్ 

బ్యాటింగ్ కూడా ఒక్క మ్యాచ్ మినహాయితే స్థిరంగా లేదు. తొలి మ్యాచ్ తర్వాత 190, 163, 120, 152 పరుగులతోనే జట్టు పరిమితమైంది. ట్రావిస్ హెడ్ నిలకడగా ఆడినా,అభిషేక్ శర్మ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 51 పరుగులకే పరిమితమయ్యాడు. "సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు ఇంకా బతికుండాలంటే మిగిలిన 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించాలి. షమీ, కమిన్స్ పవర్‌ప్లేలో బ్రేక్‌త్రూ ఇవ్వలేకపోతున్నారు. స్పిన్నర్లు లేదా డెత్ ఓవర్ స్పెషలిస్టులు జట్టులో లేరు. కెప్టెన్ కమిన్స్ దానిపై దృష్టి పెట్టాలి" అని టీం ఇండియా మాజీ క్రికెటర్ నోయల్ డేవిడ్ అన్నారు .

వివరాలు 

క్రికెట్ అభిమానులు ఏమంటున్నారు? 

"సమష్టి ప్రదర్శన కనిపించడం లేదు. ఇది బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలన్నింటినీ ప్రభావితం చేస్తోంది. ఆటతీరు ఇలాగే కొనసాగితే, వచ్చే ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లకు డిమాండ్ తక్కువ అవుతుంది" అని క్రికెట్ విశ్లేషకుడు బి. మోహన్ అన్నారు. ప్రముఖ మీడియా నిర్వహించిన ఓ పోస్ట్‌కి స్పందించిన అభిమానులు.. "టాప్ ఆర్డర్ ఫెయిలవుతోంది", "ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది", "తప్పు టాస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు", "హోమ్ పిచ్ సపోర్ట్ ఇవ్వడం లేదు", "బౌలర్లు దుర్బలంగా ఉన్నారు"అంటూ యూజర్లు తమ అభిప్రాయాలు చెప్పారు. బౌలింగ్ బలహీనత, బ్యాటింగ్ వైఫల్యం అన్నీ కలిసి జట్టును దెబ్బతీశాయి. నేను సిగ్గుతో మ్యాచ్ చూడడం మానేశాను'' అని కామెంట్ పెట్టారు.

వివరాలు 

ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో ఎవరెవరున్నారు? 

ఎస్‌ఆర్‌హెచ్ 20 మంది ఆటగాళ్లతో ఈ సీజన్‌కు సిద్ధమైంది. వారిలో ప్రధానంగా బ్యాటర్లు - ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ. ఆల్‌రౌండర్లు - అభిషేక్ శర్మ, నితీశ్ రెడ్డి, హర్షల్ పటేల్, కమిందు మెండిస్. బౌలర్లు - పాట్ కమిన్స్ (కెప్టెన్), షమీ, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, మలింగ ఇషాన్, సిమర్‌జీత్ సింగ్.