Modi-Para athletes: అంత కోపమెందుకు నవదీప్! .. భారత పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ
భారత పారా అథ్లెట్లు పారిస్ పారాలింపిక్స్‌లో ప్రదర్శించిన అద్భుత ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. గురువారం,మోదీ తన నివాసంలో పారా అథ్లెట్లను కలిశారు.వారితో సరదాగా మాట్లాడారు. 400మీ. టీ20 విభాగంలో కాంస్యం గెలిచిన అథ్లెట్ జీవాంజి దీప్తి,వరుసగా రెండో పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన పారా షూటర్ అవని లేఖరా,జూడోలో దేశానికి తొలి పతకం అందించిన కపిల్ పర్మార్ తదితర అథ్లెట్లను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. కర్నూలు జిల్లా ప్యాపిలి చెందిన పారాలింపియన్ వెంకటనారయణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పారిస్‌లో కాంస్య పతకం సాధించిన కపిల్,తన కాంస్య పతకంపై కపిల్..మోదీ సంతకాన్ని తీసుకున్నాడు. మరుగుజ్జు జావెలిన్ త్రోయర్ నవ్‌దీప్, ప్రధాని మోదీకి టోపీ బహూకరించారు. ఆ సమయంలో మోదీ కింద కూర్చున్నారు.
మీకు మాటిచ్చినట్టుగానే పసిడి గెలుచుకున్నాను: నవ్‌దీప్
"త్రో విసిరిన తరువాత మీరు ఎందుకు అంత కోపంగా కనిపించారు?"అని ప్రధాని నవ్‌దీప్‌ను అడిగారు. "క్రితం పారాలింపిక్స్‌లో నాలుగో స్థానం వచ్చింది ,ఈసారి మీకు మాటిచ్చినట్టుగానే పసిడి గెలుచుకున్నాను..భావోద్వేగంలో అలా,"అని నవ్‌దీప్ సమాధానమిచ్చాడు. రెండు చేతుల్లేని పారా ఆర్చర్ శీతల్ దేవి తన కాలితో సంతకం చేసిన జెర్సీని ప్రధానికి అందించారు. "ప్రధానమంత్రి అంటే అందరికీ పీఎం.కానీ మాకు పీఎం అంటే పరమ్ మిత్రా(సన్నిహిత నేస్తం),"అని డిస్కస్ త్రోయర్ యోగేశ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ,భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా తదితరులు పాల్గొన్నారు. పారిస్‌లో 7 స్వర్ణాలు,9 రజతాలు,13 కాంస్యాలతో కలిపి 29 పతకాలతో భారత్,పారాలింపిక్స్ చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది.