LOADING...
IND vs PAK-Asia Cup 2025: ఆసియా కప్ ఫైనల్లో భారత్,పాక్ ఎందుకు ఎప్పుడూ తలపడలేదో తెలుసా?
ఆసియా కప్ ఫైనల్లో భారత్,పాక్ ఎందుకు ఎప్పుడూ తలపడలేదో తెలుసా?

IND vs PAK-Asia Cup 2025: ఆసియా కప్ ఫైనల్లో భారత్,పాక్ ఎందుకు ఎప్పుడూ తలపడలేదో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ఆసియా కప్‌ 17వ ఎడిషన్‌ జరుగుతోంది. ఈ ఎడిషన్‌ లో ఇప్పటికే టీమిండియా తన తొలి మ్యాచ్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో ఆడింది. పసికూనపై కష్టపడకుండా అలవోకగా ఘన విజయం సాధించింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆతృతగా ఎదురుచూసే మ్యాచ్‌లలో భారత్‌-పాకిస్థాన్‌ పోరు ఒకటి. ప్రస్తుతం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సంబంధాలు వద్దని డిమాండ్లు చేస్తున్న సమయంలో ఈ మ్యాచ్‌ నిర్వహణ విషయంపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్ 14న భారత్ - పాక్‌ మ్యాచ్‌ కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈక్రమంలో ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు 

ఆసియా కప్‌లో మొత్తం 19 సార్లు భారత్‌-పాక్‌ మధ్య పోరాటం

ఇప్పటి వరకు ఆసియా కప్‌లో మొత్తం 19 సార్లు భారత్‌-పాక్‌ మధ్య పోరాటం జరిగింది. అందులో టీమ్‌ఇండియా 10 సార్లు గెలిచింది,పాకిస్థాన్‌ 6 సార్లు విజయం సాధించింది. మిగిలిన 3 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ పోటీలు అన్ని గ్రూప్ స్టేజ్‌,సూపర్‌ 4 లేదా సెమీఫైనల్స్‌లో జరిగినవే కావడం గమనార్హం. ఆసియా కప్‌ ఫైనల్‌ వేదికపై భారత్‌-పాక్‌ మధ్య పోరు ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు.గణాంకాలు స్పష్టంగా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. టీమిండియా ఇప్పటి వరకు మొత్తం 8 సార్లు ఆసియా కప్‌ టైటిల్‌ను గెలుచుకున్నప్పటికీ,ఒక్కసారి కూడా పాకిస్థాన్‌తో ఫైనల్‌ పోరు జరగలేదు. మరోవైపు పాకిస్థాన్‌ కేవలం రెండుసార్లు మాత్రమే ఛాంపియన్‌గా నిలిచింది.

వివరాలు 

 1986లో టోర్నీని బహిష్కరించిన భారత్‌ 

అయితే, టీ20 ప్రపంచకప్‌, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో మాత్రం ఇరుజట్లూ తలపడ్డాయి. ఆసియా కప్‌ మొదటి ఎడిషన్‌ 1984లో ప్రారంభమైంది. అప్పట్లో మూడు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ఫైనల్‌కు టీమిండియా, శ్రీలంక వచ్చాయి. తరువాత 1986లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భారత్‌ టోర్నీని బహిష్కరించగా, 1991లో పాకిస్థాన్‌ పాల్గొనలేదు. ఆ తర్వాత ఇరుజట్లూ ఒక్కసారిగా కూడా ఫైనల్‌కు చేరుకోలేదు. టీమిండియా మొత్తం 11 సార్లు ఆసియా కప్‌ టైటిల్‌ పోరుకు వచ్చినా ప్రత్యర్థి పాక్‌ మాత్రం రాలేదు. శ్రీలంక మాత్రం ఆసియా కప్‌లో అత్యధికంగా ఆరుసార్లు విజేతగా నిలవడం విశేషం.