Virat Kohli: కోహ్లీ 18వ నంబర్ జెర్సీని ధరించడం వెనుక ప్రత్యేక కారణం.. ఏంటో తెలుసా?
భారతదేశంలో క్రికెట్ కేవలం ఓ ఆట కాదు, అది ఒక భావోద్వేగం. భారత క్రికెటర్లు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శనలతో పాటు వారి వ్యక్తిగత విశ్వాసాలను కూడా బాగా ప్రదర్శించారు. వారు నమ్ముతున్న వ్యక్తిగత నమ్మకాలు వారి జీవితాలపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. జెర్సీ నంబర్ 18 అంటే ఎవరికి చెప్పినా, క్రికెట్ ప్రపంచంలో వెంటనే గుర్తుకు వచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ, కింగ్ కోహ్లీ 18 నంబర్ జెర్సీని ధరించడం ప్రత్యేకం. 2008లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో కూడా విరాట్ కోహ్లీ 18వ నంబర్ జెర్సీని ధరించాడు. అతని నాయకత్వంలో జట్టును చాంపియన్‌గా మార్చి విజయం అందించాడు.
కోహ్లీకి ఈ నంబర్‌తో ఉన్న సంబంధం ఏమిటి?
ఆ తర్వాత, అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా కోహ్లీ 18 నంబర్ జెర్సీని మాత్రమే ధరిస్తున్నాడు. ఈ 18 నంబర్ ప్రత్యేకత ఏమిటి,కోహ్లీకి ఈ నంబర్‌తో ఉన్న సంబంధం ఏమిటి? కోహ్లీ మైదానంలో సరదాగా, సీరియస్‌గా ఉంటాడు కానీ ఈ నంబర్‌తో అతనికి ప్రత్యేకమైన అనుభూతి ఉంది.నిజానికి,ఈ నంబర్ జెర్సీని ధరించడం వెనుక ఒక భావోద్వేగమైన కారణం ఉంది. 2008 అండర్-19 ప్రపంచకప్‌కు ముందు,2006 డిసెంబర్ 18న కోహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీ మరణించారు. ఆ సమయంలో కోహ్లీ 17 ఏళ్ల వయసులో ఉన్నాడు,కర్ణాటకతో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. తన తండ్రి మరణం గురించి తెలిసినప్పటికీ,జట్టుకు తన బాధ్యతను నిర్వర్తించాలనే నిర్ణయం తీసుకున్నాడు.ఆ మ్యాచ్‌లో 90 పరుగులు సాధించాడు.
18 నంబర్ జెర్సీని ధరించిన తర్వాత కోహ్లీ.. విజయాల శిఖరానికి..
విరాట్ 2008 ఆగస్టు 18న భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. తన జీవితంలో 18వ తేదీ చాలా ముఖ్యమైనది అని విరాట్ కోహ్లీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ తేదీ అతని జీవితాన్ని ప్రభావితం చేసింది. 18 నంబర్ జెర్సీని ధరించిన తర్వాత కోహ్లీ తన కెరీర్లో విజయాల శిఖరానికి చేరుకున్నాడు.