PAK Vs AFG: అఫ్గాన్‌తోనూ పోరాడాల్సి వస్తుంది : షోయబ్ అక్తర్
వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. అఫ్గానిస్తాన్‌తో చైన్నై వేదికగా ఇవాళ తలపడుతోంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన పాక్ మళ్లీ విజయాల బాట పట్టేందుకు గట్టి పట్టుదలతో ఉంది. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన అఫ్గాన్ కూడా మరో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ షోయాబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేవలం అఫ్గాన్‌తో మ్యాచులో మాత్రమే కాదని, ప్రేక్షకులు, గ్రౌండ్ సిబ్బందితో కూడా పాక్ పోరాడాల్సి వస్తుందని చెప్పాడు. గత రెండు మ్యాచుల నుంచి పాక్‌కు ప్రేక్షకుల నుంచి సరైన మద్దతు లభించలేదని విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు.
ఆఫ్గాన్ పై పాక్ దే పైచేయి
ఆఫ్గాన్ గట్టి జట్టేనని, వారిని తక్కువ అంచనా వేయకూడదని, ఆఫ్గాన్ స్పిన్ విభాగం పటిష్టంగా ఉందని షోయాబ్ అక్తర్ పేర్కొన్నారు. అయితే పాక్, ఆఫ్గాన్ చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా లేదని, పిచ్ కూడా వారికి అనుకూలంగా ఉండొచ్చన్నారు. చైన్నై పిచ్ స్పిన్ ట్రాక్ అని, ఈ గ్రౌండ్‌లో స్పిన్నర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, కావున ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉందని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా, ఆఫ్గాన్, పాక్ ఇప్పటివరకూ ఏడుసార్లు తలపడ్డగా, అన్నింట్లోనూ పాకిస్థాన్ నే విజయం సాధించింది.