D Gukesh: విశ్వ విజేతగా గుకేశ్‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే?
2024 ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్ రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ విశ్వవిజేతగా గుర్తింపు పొందాడు. 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయసులో ఈ ఘనత సాధించడం ద్వారా, ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయస్సులో ఈ ఘనత అందుకున్నాడు.
అయిదు సార్లు టైటిల్ గెలిచిన విశ్వనాథన్ ఆనంద్
గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. విశ్వనాథన్ ఆనంద్ ఈ టైటిల్‌ను అయిదు సార్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. గుకేశ్ విజేతగా నిలిచినందుకు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల నగదు బహుమతి అందుకోగా, రన్నరప్ అయిన డింగ్ లిరెన్ రూ.9.75 కోట్ల బహుమతిని పొందాడు. మొత్తం ప్రైజ్‌మనీ రూ.21.17 కోట్లుగా ఉండగా, ఒక్కో గేమ్ గెలిచిన ప్లేయర్‌కు రూ.1.69 కోట్లు బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మూడు గేమ్‌లు గెలిచిన గుకేశ్ రూ.5.07 కోట్లు సంపాదించగా, రెండు గేమ్‌లు గెలిచిన లిరెన్ రూ.3.38 కోట్లు పొందాడు. మిగిలిన ప్రైజ్‌మనీని సమానంగా పంచుకున్నారు.