World Cup 2023 : భారత్-పాక్ మ్యాచ్ తేదీలో మార్పు.. ఎప్పుడంటే?
ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచ కప్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే దసరా నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ విషయంలో సమస్యలు తలెత్తాయని బీసీసీఐకి సెక్యూరిటీ ఏజెన్సీలు ఇప్పటికే సూచించాయి. దీంతో మ్యాచ్ అక్టోబర్ 15న కాకుండా ఒకరోజు ముందు అంటే అక్టోబర్ 14న దయాదుల మధ్య హైఓల్టోజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం తమ మరో మ్యాచ్ షెడ్యూల్ మార్చడానికి కూడా పీసీబీ అంగీకరించింది.
అక్టోబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్
అక్టోబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అంతకుముందు శ్రీలంకతో హైదరాబాద్ లో పాక్ ఆడాల్సిన మ్యాచ్ షెడ్యూల్ కూడా మార్పు జరిగింది. అక్టోబర్ 12న ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా, ప్రస్తుతం అక్టోబర్ 10న జరగనుంది. దీంతో పాకిస్తాన్ కు ఇండియాతో మ్యాచ్ ఆడటానికి మూడ్రోజుల సమయం దొరకనుంది. భారత్-పాకిస్థాన్ ఒక్క మ్యాచ్ వల్ల మిగతా మ్యాచుల షెడ్యూల్ కూడా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే త్వరలోనే బీసీసీఐ కొత్త షెడ్యూల్ ను రిలీజ్ చేయనుంది