
World Test Championship: అక్కడ గెలిస్తే అదనపు పాయింట్లు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫార్మాట్‌లో సరికొత్త మార్పులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సిద్ధమవుతోంది.
2025 జూన్‌లో ప్రారంభమయ్యే నాలుగో ఎడిషన్‌లో పాయింట్ల కేటాయింపు విధానంలో గణనీయమైన మార్పులు జరిగే అవకాశముంది.
టెస్టు క్రికెట్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చే దిశగా ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
ముఖ్యంగా విదేశీ గడ్డపై సాధించిన విజయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే విధంగా కొత్త నియమాలను అమలు చేసే యోచనలో ఉంది.
వివరాలు
కొత్త సీజన్ - డబ్ల్యూటీసీ మార్పులు
ప్రస్తుతం జరుగుతున్న మూడో డబ్ల్యూటీసీ సైకిల్, జూన్ 11, 2025న లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది.
ఈ ఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడతాయి. ప్రస్తుతం అమలులో ఉన్న పాయింట్ల వ్యవస్థ ప్రకారం, టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 12 పాయింట్లు, మ్యాచ్ టై అయితే 6 పాయింట్లు, డ్రా అయితే 4 పాయింట్లు లభిస్తాయి.
విజయాల శాతం ఆధారంగా జట్లకు ర్యాంకింగ్స్ కేటాయించబడతాయి.
వివరాలు
పాయింట్ల వ్యవస్థలో మార్పులు
ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం,డబ్ల్యూటీసీ నాలుగో సీజన్‌లో ఐసీసీ పాయింట్ల కేటాయింపు విధానంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా,విదేశాల్లో సాధించిన విజయాలకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చే అవకాశం ఉంది.
ఉదాహరణకు,భారత్ ఆస్ట్రేలియా గడ్డపై విజయం సాధిస్తే,అదనపు పాయింట్లను పొందేలా కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
అంతేకాదు,భారీ తేడాతో విజయాలను సాధించిన జట్లకు అదనపు బోనస్ పాయింట్లు కేటాయించనున్నట్లు సమాచారం.
అంటే, 10వికెట్ల తేడాతో గెలిచిన లేదా ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకున్న జట్లకు అదనపు పాయింట్లను ఇస్తారు.
ప్రస్తుతం భారతదేశంలోని రంజీ ట్రోఫీ,ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్ వంటి టోర్నమెంట్లలో బోనస్ పాయింట్లు ఇవ్వడాన్ని అనుసరించి, డబ్ల్యూటీసీలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని ఐసీసీ భావిస్తోంది.
వివరాలు
హోం,అవే సిరీస్‌లలో సమతుల్యత
ప్రస్తుత డబ్ల్యూటీసీ ఫార్మాట్‌లో 10 జట్లు పరస్పరం అన్ని జట్లతో తలపడవు. కొద్ది జట్ల మధ్య మాత్రమే టెస్టు సిరీస్‌లు జరుగుతాయి.
దీంతో, హోం గ్రౌండ్ అనుకూలత ఎక్కువగా ఉండటంతో, విదేశాల్లో సాధించిన విజయాలకు అధిక ప్రాముఖ్యతనిచ్చేలా ఐసీసీ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది.
ఈ కొత్త పాయింట్ల వ్యవస్థపై ఏప్రిల్‌లో జరగబోయే ఐసీసీ సమావేశంలో అధికారిక చర్చ జరగనుంది.
అన్ని జట్లకు సమాన అవకాశాలు కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని ఐసీసీ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మిగతా జట్ల కంటే ఎక్కువ టెస్టులు ఆడుతున్నాయి. అందుకే, కొత్త పాయింట్ల వ్యవస్థ ద్వారా సమతుల్యతను తీసుకురావాలని ఐసీసీ భావిస్తోంది.
వివరాలు
విమర్శలు.. ప్రతిస్పందనలు
ప్రస్తుతం అమలులో ఉన్న డబ్ల్యూటీసీ పాయింట్ల విధానం పలు విమర్శలను ఎదుర్కొంటోంది.
విదేశాల్లో గెలిచినా, గెలుపు తేడా ఎంత ఎక్కువైనా ఒకే విధమైన పాయింట్లు కేటాయించబడుతుండటం వివాదాస్పదంగా మారింది.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఈ విధానంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ మరింత సమర్థంగా ఉండేలా పాయింట్ల వ్యవస్థను మెరుగుపర్చాలని ఇంగ్లండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ అభిప్రాయపడ్డారు.