WTC 2023-25: పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి.. మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి భారత్
భారత జట్టు ఆస్ట్రేలియాలో బోణి చేసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఆస్ట్రేలియాను 295 పరుగుల భారీ తేడాతో ఓడించింది. 534 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 238 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. తర్వాత ఆస్ట్రేలియాను 104 పరుగులకే కుప్పకూల్చి, 46 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారు.
30 నిమిషాల్లో మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 161 పరుగులు, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ, కేఎల్ రాహుల్ కూడా 77 పరుగులు చేశారు. దీంతో టీమిండియా 487/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 534 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు మూడో రోజు 30 నిమిషాల్లో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు 12/3తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 238 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ 89 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 47 పరుగులతో కొంత ప్రతిఘటన చూపించాడు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో సత్తా చాటాడు.
భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి..
ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభమవుతుంది. గత రెండు పర్యాయాల్లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 2-1తో గెలుచుకుంది. ఈసారి కూడా అదే లక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు ఇది టీమిండియాకు చివరి టెస్టు సిరీస్. 4-0తో గెలిస్తే, భారత్ వరుసగా మూడోసారి ఫైనల్ చేరే అవకాశాన్ని దక్కించుకుంటుంది. పెర్త్ టెస్టు విజయంతో, భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.