WTC Final: తొలిరోజు ఆసీసీదే.. విఫలమైన టీమిండియా బౌలర్లు
టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా చెలరేగింది. తొలి సెషన్ నుంచి నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా తొలి రోజే 300 మార్క్ దాటి భారీ స్కోరు దిశగా సాగింది. ట్రావిస్ హెడ్ శతకంతో విజృంభించగా.. స్మిత్ సెంచరీకి చేరువయ్యాడు. భారత బౌలర్లు వికెట్లు తీయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 85 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(146 పరుగులు) స్మిత్ (95 పరుగులు) క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీకి చెరో వికెట్ దక్కింది. చివరి 60 ఓవర్లలో టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్లు కూడా తీయలేకపోవడం గమనార్హం.
వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన ట్రావిస్ హెడ్
స్మిత్, ట్రావిస్ హెడ్ నాలుగో వికెట్ కు రికార్డు స్థాయిలో 251 పరుగులు జోడించారు. తొలి సెషన్ లో రెండు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు, మిగిలిన సెషన్లో కేవలం ఒక వికెట్ తీశారు. ఓపెనర్ డేవిడ్ ఇచ్చిన ఆరంభాన్ని హెడ్, స్మిత్ చక్కగా కొనసాగించారు. ముఖ్యంగా హెడ్ వన్డే తరహాలో టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోపక్క తన మార్క్ ఇన్నింగ్స్ ఆకట్టుకున్న స్మిత్ రెండు రోజు ఆటలో సెంచరీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్ తొలి రోజు ఆటలో ఒక్క వికెట్ ను కూడా పడగొట్టలేకపోయారు. స్పిన్నర్ అశ్విన్ లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది.