Lok Sabha elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ.. ఖండించిన యువరాజ్
దేశంలో కొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా,ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా క్రీడా రంగానికి చెందిన పలువురు క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా,టీమిండియా మాజీ వెటరన్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గురించి కూడా అలాంటి వార్తలు వచ్చాయి. ఇందులో మాజీక్రికెటర్ పంజాబ్ నుండి ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విషయమై యువరాజ్ స్వయంగా ఓ ప్రకటన విడుదల చేస్తూ తాను ఎన్నికల బరిలో నిలవడం లేదంటూ స్పష్టం చేశారు. ఇటీవల,పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుండి యువరాజ్ సింగ్‌కు బిజెపి లోక్‌సభ ఎన్నికల టిక్కెట్టు ఇవ్వవచ్చని వివిధ మీడియా నివేదికలలో పేర్కొంది. పార్టీ సీనియర్ అధికారులు కొందరు ప్రముఖ క్రికెటర్‌తో సమావేశమై ఈవిషయమై మాట్లాడినట్లు సమాచారం.
ఈ పనిపైనే యువరాజ్ దృష్టి
దీంతో ఈ కథనాలపై తాజాగా యువరాజ్ సింగ్ స్పందించారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ వార్తలను ఖండించారు. 'మీడియాలో వస్తోన్న కథనాలకు నేను వ్యతిరేకం. గురుదాస్‌పూర్ నుంచి నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నా స్థాయికి తగ్గట్టు ప్రజలకు సాయం చేయడమే నా అభిరుచి. నా 'YouWeCan' ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. మార్పు తీసుకురావడం కోసం మన సామర్థ్యం మేర ప్రయత్నిద్దాం.'' అని ఎక్స్‌లో యువరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.
యువరాజ్ చేసిన ట్వీట్
2019లో గంభీర్ రాజకీయ అరంగేట్రం
యువరాజ్ కంటే ముందు, వెటరన్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రవేశించాడు. బీజేపీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా అరంగేట్రం చేసి తూర్పు ఢిల్లీ నుంచి అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. తన మాజీ సహచరుడు గంభీర్‌లాగే యువరాజ్ కూడా లోక్‌సభ ఎన్నికల నుంచి నేరుగా క్రియాశీల రాజకీయాల్లోకి వస్తాడని భావించారు, కానీ ఇప్పుడు అది జరగడం లేదు. అయితే, ప్రముఖ బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ ఎంపీగా ఉన్న గురుదాస్‌పూర్ సీటు ఇప్పటికీ బీజేపీ వద్ద ఉంది.