ఐపీఎల్ చరిత్రలో యుజ్వేంద్ర చాహల్ ఆల్ టైం రికార్డు
ఐపీఎల్‌లో నిన్న సన్ రైజర్స్, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు మంచి థ్రిల్ ఇచ్చింది. ఆఖరి బంతికి అబ్దుల్ సమద్ సిక్సర్ కొట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే రాజస్థాన్ తరుపున అద్భుతంగా బౌలింగ్ చేసిన యుజ్వేంద్ర చాహల్ అద్భుత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి కేవలం 29 పరుగులిచ్చి 4 కీలక వికెట్లను పడగొట్టాడు. ఫలితంగా ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో 183 వికెట్లు తీసి డ్వేన్ బ్రావోతో కలిసి చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు.
చాహల్
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎక్కువ కాలం ఆడిన డ్వేన్ బ్రావో తన ఐపీఎల్ కెరీర్‌లో 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీశాడు. ఆదివారం సన్‌రైజర్స్‌పై 4 వికెట్లు తీసిన చాహల్ కూడా మొత్తం 143 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీశాడు. ఇక చాహల్ తరువాతి మ్యాచ్ లో ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. పీయూష్ చావ్లా (174), అమిత్ మిశ్రా (172), రవిచంద్రన్ అశ్విన్ (171) వికెట్లతో తర్వాతి స్థానంలో నిలిచారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 214 పరుగుల భారీ స్కోరును చేసింది. లక్ష్య చేధనకు దిగిన సన్ రైజర్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టి విజయాన్ని అందుకుంది.