
Yuzvendra Chahal: విడాకుల తర్వాత తాను చాలా విమర్శలు ఎదురుకొన్నా.. సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయ్:చాహల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఇటీవలే తమ వైవాహిక జీవితం ముగించుకున్నారు. ఈ పరిణామం తర్వాత తనపై వచ్చిన విమర్శల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చాహల్ తన భావోద్వేగాలను వ్యక్తపరిచాడు.
వివరాలు
మోసగాడిగా అభివర్ణించారు
"ధనశ్రీతో విడాకుల అనంతరం చాలా మంది నన్ను 'మోసగాడు'గా అభివర్ణించారు.కానీ నిజంగా చూసుకుంటే, నేను ఎప్పుడూ ఎవరినీ మోసం చేయలేదు. నాకున్న స్నేహితులు, కుటుంబసభ్యులు నేను ఎంత నమ్మకంగా ఉన్నానో వారికే తెలుసు. నేను నమ్మకానికి పెద్ద పీట వేస్తాను. నా జీవితంలో ఉన్న వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాను. నిజానికి, మా రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఏం జరిగిందో కొంతమందికి అసలేం తెలీదు. అయినా వారు నన్నే తప్పుపట్టారు" అని చాహల్ చెప్పాడు.
వివరాలు
కెరీర్ అడ్డంకిగా మారింది
"మేమిద్దరం కూడా మా కెరీర్‌లో విజయాన్ని సాధించాలనుకున్నాం. అదే కారణంగా, వ్యక్తిగత బంధానికి తగినంత సమయం ఇవ్వడం కష్టంగా మారింది. ఒక దశలో భావోద్వేగ సంబంధాలు కూడా సడలిపోయాయి. అప్పుడు రాజీ పడడం తప్ప ఇతర మార్గం ఉండదు. కానీ రెండు వ్యక్తుల లక్ష్యాలు, వ్యక్తిత్వాలు ఒకే దిశగా లేకపోతే, ఆ ప్రభావం రిలేషన్‌పై పడక తప్పదు. కెరీర్ కీలక దశలో భాగస్వామికి సమయం కేటాయించడం కష్టం అవుతుంది. అలాంటి సమయంలో ఇతరులు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో మద్దతుగా నిలవడం అత్యంత అవసరం" అని ఆయన వివరించాడు.
వివరాలు
చాలా విమర్శలు ఎదుర్కొన్నా..
"విడాకులు తీసుకున్న తర్వాత నా మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. నన్ను మోసగాడన్నవారు, మహిళలను గౌరవించడం రాదన్నవారు కూడా ఉన్నారు. కానీ నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్లతోనే పెరిగాను. నాకు మహిళల పట్ల గౌరవం ఎలా ఉండాలో బాగా తెలుసు. నా తల్లిదండ్రులే నన్ను ఆ సంస్కారంతో పెంచారు. ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్ల నుంచి నేర్చుకునే ధోరణిలో ఉంటాను. అయినప్పటికీ, నా వ్యక్తిగత జీవితాన్ని ఇష్టానుసారంగా వార్తలుగా మార్చేశారు. కేవలం వారి వ్యూస్ కోసం ఇలా చేశారు."
వివరాలు
ఒత్తిడితో నిద్రలేని రోజులు.. సూసైడ్ ఆలోచనలు
"నా వ్యక్తిగత జీవితం గురించి స్క్రూటినీ చేసినప్పుడు తీవ్ర ఆందోళన చెందా. కొన్ని రోజుల పాటు రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయే స్థితికి చేరుకున్నాను. ఇలా 45 రోజులు గడిచాయి. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాను. ఏ విషయం మీదా ధ్యాస పెట్టలేకపోయాను. సుమారు ఐదు నెలల పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో వున్నాను. కొన్నిసార్లు నా అత్యంత సన్నిహిత మిత్రుడితో ఆత్మహత్య ఆలోచనలు పంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది నిజంగా భయానకమైన అనుభవం" అని చాహల్ భావోద్వేగంగా వెల్లడించాడు.
వివరాలు
స్నేహితుల మద్దతుతో తిరిగి నిలబడ్డాను
"ఇలాంటి క్లిష్ట సమయంలో ఎక్కువగా నా వ్యక్తిగత విషయాలను స్నేహితులతో మాత్రమే పంచుకునే వాడిని. నా కుటుంబ సభ్యులను ఆందోళనపెట్టే ఉద్దేశం నాకు ఉండదు. ప్రాతిక్ పవార్, ఆర్జే మహ్‌వషా, ఇంకా కొంతమంది నమ్మకమైన స్నేహితులు నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ల మద్దతుతోనే నేను మళ్లీ మామూలు జీవితం వైపు వచ్చాను. ఈరోజు వాళ్లందరూ కూడా నా వెనుక నిలబడి ఉన్నారు" అని చాహల్ ధైర్యంగా తెలిపాడు.