LOADING...
Russia: ధ్వని వేగం కంటే 10 రెట్లు వేగం.. రష్యా 'కింజల్' దూకుడు ప్రపంచానికి సవాల్
ధ్వని వేగం కంటే 10 రెట్లు వేగం.. రష్యా 'కింజల్' దూకుడు ప్రపంచానికి సవాల్

Russia: ధ్వని వేగం కంటే 10 రెట్లు వేగం.. రష్యా 'కింజల్' దూకుడు ప్రపంచానికి సవాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2025
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేస్తూ రష్యా తన అత్యంత ప్రమాదకరమైన హైపర్సోనిక్ క్షిపణి 'కింజాల్' ను విజయవంతంగా పరీక్షించింది. 'జపాడ్-2025' సైనిక విన్యాసాల సమయంలో ఈ ప్రయోగం జరిగింది. ధ్వని వేగం కంటే 10 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణిని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం అని రక్షణ విశ్లేషకులు పేర్కొన్నారు. రష్యన్ మీడియా 'ఇంటర్‌ఫ్యాక్స్' ప్రకారం, ఈ క్షిపణి మిగ్-31 యుద్ధవిమానాల్లో అమర్చబడి బారెంట్స్ సముద్రంపై నాలుగు గంటల పాటు ప్రయాణించింది. భూమిపై, ఆకాశంలో, సముద్రంలో ఎక్కడి నుంచైనా ఎదురొచ్చే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం తమ వద్ద ఉందని రష్యా ఈ ప్రయోగం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పింది.

Details

'కింజల్' అంటే ఏమిటి?

'కింజల్' అనే పదం రష్యన్ భాషలో 'కత్తి' అని అర్థం. ఈ క్షిపణి అణ్వాయుధాలు, సాంప్రదాయ వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. దీని అధిక వేగం, ఎత్తు కారణంగా ప్రపంచంలోని ఏ రక్షణ వ్యవస్థ కూడా దీన్ని గుర్తించడం, ఆపడం చాలా కష్టం అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్షిపణికి బలహీనతలు కూడా ఉన్నాయంటూ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2025లో పలు సార్లు కింజల్ తన లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరడంలో విఫలమైందని సమాచారం. కారణం - క్షిపణి ఎంత వేగంగా ప్రయాణిస్తే, దాని స్థానం, కోఆర్డినేట్‌లను ఖచ్చితంగా గుర్తించడం అంత కష్టమవుతుందని నిపుణుల విశ్లేషణ.

Details

ఉక్రెయిన్ ప్రతిస్పందన

ఈ బలహీనతను ఉక్రెయిన్ సద్వినియోగం చేసుకుంది. కీవ్ సైన్యం ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (EW) వ్యవస్థలను ఉపయోగించి కింజల్ క్షిపణులను తప్పుదారి పట్టించింది. దీంతో రష్యా దాడుల తీవ్రతను గణనీయంగా తగ్గించగలిగిందని సమాచారం. EWతో ఎదుర్కొనే ప్రయత్నంలోనే రష్యా ఇప్పటివరకు $1.5 బిలియన్లకు పైగా ఖర్చు చేసినట్లు అంచనా. తన క్షిపణులు, డ్రోన్‌లను రక్షించుకోవడానికి రష్యా CRPA (జామ్-రెసిస్టెంట్ యాంటెన్నాలు)ని ఏర్పాటు చేయడం ప్రారంభించింది. ఒక్కో యాంటెన్నా ధర 10 వేల నుంచి 17 వేల డాలర్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ యాంటెన్నాలను KAB బాంబులు, షాహెద్ డ్రోన్‌లలో కూడా అమర్చుతున్నారు.