
Pakistan: పాకిస్థాన్ క్వెట్టాలో బీఎన్‌పీ రాజకీయ సమావేశంలో ఆత్మాహుతి దాడి..14 మంది మృతి,30 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో మంగళవారం రాత్రి ఘోరమైన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని అత్యవసరంగా సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బలోచిస్తాన్ నేషనల్ పార్టీ స్థాపకుడు, అలాగే మాజీ ప్రావిన్షియల్ ముఖ్యమంత్రి సర్దార్ అతావుల్లా మెంగల్ వర్ధంతి సందర్భంగా, క్వెట్టాలో బీఎన్‌పీ ఏర్పాటు చేసిన రాజకీయ సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఒక వ్యక్తి ఆత్మాహుతి దాడి జరిపాడని ప్రభుత్వ అధికారి హంజా షఫాత్ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. క్వెట్టా నగరంలోని షావానీ స్టేడియంలో నిర్వహించిన ఈ సభకు వందలాది బలోచ్ అనుచరులు హాజరయ్యారు.
వివరాలు
బీఎన్‌పీ నేత సర్దార్ అక్తర్ మెంగల్ సురక్షితంగా ఉన్నారు
కార్యక్రమం కొనసాగుతుండగా,స్టేడియం పార్కింగ్ ప్రాంతంలో దాడి జరిగింది. బాంబు పేలుడు కారణంగా కొందరు అక్కడికక్కడే మృతి చెందగా,మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టగా,భద్రతా బలగాలు మొత్తం స్టేడియం పరిసరాలను ముట్టడి చేసి తనిఖీలు ప్రారంభించాయి. ఈ దాడిలో సర్దార్ అతావుల్లా మెంగల్ కుమారుడు,బీఎన్‌పీ నేత సర్దార్ అక్తర్ మెంగల్ సురక్షితంగా ఉన్నారని హంజా షఫాత్ తెలిపారు. మొత్తం 30 మందికి పైగా గాయపడ్డారని వివరించారు. సభ ముగిసిన తర్వాత జనాలు బయటకు వెళ్తుండగా, పార్కింగ్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని ఆయన వివరించారు. అయితే, ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదని స్పష్టం చేశారు.