Illegal immigrants: 18వేల మంది భారతీయులకు షాక్ ఇచ్చిన ట్రంప్.. అమెరికా 'డీపోర్టేషన్' ముప్పు!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక, అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన అధికారిక ఆదేశాలు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో, అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అక్రమ వలసదారుల జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పరిణామంలో, 18 వేల మంది ప్రవాస భారతీయులు అమెరికాలో డీపోర్టేషన్ ముప్పును ఎదుర్కొంటున్నట్లు సమాచారం వచ్చింది.
హోండురస్ దేశం 2,61,651 మంది తో మొదటి స్థానం
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని గురించీ, యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) తాజాగా గణాంకాలను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 14.45 లక్షల మంది ఉన్నారు. ఇందులో హోండురస్ దేశం 2,61,651 మంది తో మొదటి స్థానంలో నిలిచింది. గ్వాటెమాలా నుంచి సుమారు 2.5 లక్షల మంది ఉంటే, మెక్సికో, ఎల్ సాల్వెడార్ దేశాలకు చెందిన వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలో 17,940 మంది భారతీయులు కూడా ఉన్నట్లు ఐఈసీ నివేదిక పేర్కొంది. అలాగే, దాదాపు 37 వేల మంది చైనీయులు కూడా ఈ డీపోర్టేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు.
అమెరికాలో లక్షలాది మంది భారతీయులు అనధికారికంగా ఉన్నట్లు అంచనా
ప్రస్తుతం అమెరికాలో లక్షలాది మంది భారతీయులు అనధికారికంగా ఉన్నట్లు అంచనా వేయబడుతోంది. సరైన పత్రాలు లేని ఈ ప్రజలు చట్టబద్ధత సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐసీఈ నుంచి క్లియరెన్స్ పొందడంలో ఏళ్ల సమయం పడుతోందని సమాచారం అందుతోంది. ఇదే సమయంలో, గత మూడు సంవత్సరాలలో అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగు పెట్టేందుకు ప్రయత్నించిన వేలాది మంది భారతీయులు పట్టుబడడం ఆందోళనకరమైన అంశంగా మారింది.
ట్రంప్, బాధ్యతలు చేపట్టిన వెంటనే భారీ స్థాయిలో డిపోర్టేషన్
అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్న ట్రంప్, బాధ్యతలు చేపట్టిన వెంటనే భారీ స్థాయిలో డిపోర్టేషన్ ఆపరేషన్లను ప్రారంభించబోతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వ నుండి సరైన సహకారం లభించకపోవడం, ఐసీఈ నిర్వహించిన దర్యాప్తు ప్రకారం, ప్రవాస భారతీయులలో ఆందోళన రేపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా, భారతదేశం దౌత్యపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం వచ్చింది.
చట్టబద్ధంగా వలస వచ్చిన వారికి మార్గం సులభతరం
ఇక, చట్టబద్ధంగా వలస వచ్చిన వారికి మార్గం సులభతరం చేస్తానని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తెలిపారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానమైన "డ్రీమర్స్"లో చాలామంది అమెరికాలో పుట్టి పెరిగిన వారిగా, అనేక మంది ఉన్నత ఉద్యోగాలు, వృత్తులలో కొనసాగుతున్నారని పేర్కొంటూ, వారి సమస్యను పట్టించుకుంటానని ట్రంప్ చెప్పారు. ఇది భారతీయ వలసదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా భావించబడింది.