
మెక్సికోలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రమాదంలో ఆరుగురు భారతీయుల దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఓ బస్సు లోయలో పడిపోయిన దారుణ ఘటన నాయారిట్ రాష్ట్రంలో జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందడం కలకలం సృష్టించింది.
మృతుల్లో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని టెపిక్‌కు ఆమడ దూరంలో ఉన్న బర్రాంకా బ్లాంకా ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
మొత్తం 40 మంది ప్రయాణికులతో టియువానా వైపు వెళుతున్న బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పింది. దీంతో వాహనం లోయలోకి దూసుకెళ్లినట్లు మెక్సికన్ అధికారులు ప్రకటించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.
details
ఆ ఆరుగురు భారతీయులు ఎవరన్న దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
ఈ మేరకు ఎమర్జెన్సీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందిలను సైతం రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే సహాయక చర్యలను ముమ్మురం చేశారు. క్షతగాత్రులను రక్షించేందుకు బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
50 మీటర్ల లోతున్న లోయలో బస్సు పడిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు ఎమర్జెన్సీ సిబ్బంది తెలిపింది.
ఘటనపై బస్సు సర్వీస్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. మరోవైపు మెక్సికో మైగ్రేషన్ ఇన్‌స్టిట్యూట్ సైతం ప్రమాదంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ప్రమాదంపై ఇంకా పూర్తి సమాచారం అందలేదు. బస్సు లోయలో పడ్డ ఘటనలో ఆరుగురు భారతీయలు మరణించినప్పటికీ వారు ఎవరన్న అంశంపై స్పష్టత రాలేదు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.