LOADING...
America: లాస్ ఏంజెలెస్‌లో కాల్పుల మోత.. ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
లాస్ ఏంజెలెస్‌లో కాల్పుల మోత.. ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

America: లాస్ ఏంజెలెస్‌లో కాల్పుల మోత.. ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది.లాస్ ఏంజెలెస్ నగరంలో సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ పార్టీలో జరిగిన కాల్పులు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను సృష్టించాయి. ఈ దారుణ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లాస్ ఏంజెలెస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (ఎల్ఏపీడీ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంఘటన నగరంలోని డౌన్‌టౌన్ ప్రాంతంలో 14వ ప్లేస్, పలోమా స్ట్రీట్‌ సమీపంలోని ఓ గిడ్డంగిలో చోటుచేసుకుంది. వారాంతంలో నిర్వహించిన 'హార్డ్ సమ్మర్' మ్యూజిక్ ఫెస్టివల్ అనంతరం అక్కడ జరిగిన ఆఫ్టర్ పార్టీలో ఈ కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో కాల్పులు జరిగాయన్న సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు.

వివరాలు 

కాల్పులకు కొన్ని గంటల ముందే పార్టీని ఖాళీ చేయించిన పోలీసులు 

ఆ పార్టీలో కాల్పులు జరగడానికి కొన్ని గంటల ముందే పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పార్టీ అనుమతిలేకుండా జరుగుతుందన్న సమాచారం ఆధారంగా అక్కడికి చేరిన వారు, సుమారు 50 మందికి పైగా ఉన్నట్టు గమనించి ఆ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి వద్ద తుపాకీ ఉన్నట్టు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం పార్టీలోని వారిని పంపించి, ప్రదేశాన్ని ఖాళీ చేయించారు. కానీ, పోలీసులు వెళ్లిన కొద్ది సేపటికే అదే ప్రాంతంలో ఈ హత్యాకాండ చోటుచేసుకుంది.

వివరాలు 

నిందితుల కోసం గాలింపు, దర్యాప్తు ప్రారంభం 

కాల్పుల తర్వాత ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అక్కడ రక్తపు మడుగుల్లో పడివున్న ఎనిమిది మందిని గుర్తించారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 52 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మిగతా ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితుల వయసు 26 నుండి 62 ఏళ్ల మధ్య ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, కాల్పులు జరిపిన దుండగుల వివరాలు కూడా తెలియరాలేదని లాస్ ఏంజెలెస్ పోలీసులు స్పష్టం చేశారు.