Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం.. మరో 2 ఇస్కాన్ పూజారులు "మిస్సింగ్ "
బంగ్లాదేశ్‌లో హిందువులపై నిరంతరం లక్ష్యంగా కొనసాగుతున్న దాడులు, అణిచివేతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీల సమస్యలను పట్టించుకోకపోవడం విమర్శలకు గురవుతోంది. ఇటీవల, ప్రముఖ హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు దేశద్రోహం అభియోగం కింద అరెస్ట్ చేశారు. అతనికి బెయిల్ సైతం నిరాకరించగా, మరో హిందూ సన్యాసి శ్యామ్ దాస్ ప్రభుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇస్కాన్ ఆందోళన
ఇస్కాన్ ప్రతినిధి రాధారమన్ దాస్ ప్రకారం, చిన్మోయ్ కృష్ణదాస్, అతని మరో ఇద్దరు శిష్యులు ఛటోగ్రామ్ ప్రాంతంలో అదృశ్యమయ్యారని శనివారం వెల్లడించారు. ''వారు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా? పోలీసుల ఉద్ధేశ్యం ఏమిటి?'' అని దాస్ ప్రశ్నించారు. తాజాగా, రంగనాథ్ శ్యాంసుందర్ దాస్ బ్రహ్మచారి, రుద్రపతి కేశవ్ దాస్ బ్రహ్మచారిలను కూడా పుండరిక్ ధామ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హింసాత్మక పరిణామాలు షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, బంగ్లాదేశ్‌లో రాడికల్ ఇస్లామిస్టులు మరింత రెచ్చిపోతున్నారు. హిందువుల ఆస్తులు, వ్యాపారాలు, దేవాలయాలు నిరంతరం టార్గెట్ అవుతుండగా, మైనారిటీల హక్కుల కోసం నినదించే వారిపై దేశద్రోహం వంటి తీవ్రమైన కేసులు మోపుతున్నారు.
ఆర్థిక నిబంధనలతో అణచివేత
ఇస్కాన్ సంస్థకు సంబంధించిన 17 బ్యాంకు ఖాతాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. దీనివల్ల హిందూ మతాచార్యులు, మైనారిటీలకు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో, అంతర్జాతీయ సమాజం బంగ్లాదేశ్‌లో మైనారిటీల హక్కుల పరిరక్షణకు మద్దతుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు.